Telangana Lockdown: నేటితో ముగియనున్న లాక్‌డౌన్, పెంచుతారా, తీసేస్తారా.., మరి కాసేపట్లో మంత్రి మండలి సమావేశం, లాక్‌డౌన్ పొడిగింపు అంశంతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం
దీంతో లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. దీనికోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో మంత్రి మండలి సమావేశం ( CM KCR cabinet to meet Today) జరగనుంది.
Hyderabad, May 30: రాష్ట్రంలో కరోనావైరస్ నివారణకు విధించిన 18 రోజుల పాటు కొనసాగిన లాక్‌డౌన్ (Telangana Lockdown) నేటితో ముగియనుంది. దీంతో లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. దీనికోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో మంత్రి మండలి సమావేశం ( CM KCR cabinet to meet Today) జరగనుంది. ఈ సందర్భంగా లాక్‌డౌన్ పొడిగింపుపై సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ (discuss lockdown extension) జరగనున్నట్లు సమాచారం.
అయితే..రాష్ట్రంలో ఇప్పటికే లాక్‌డౌన్ కఠినంగా అమలువుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతిచ్చారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతిండంలేదు.లాక్‌డౌన్ నుంచి రోజుకు 4 గంటలు మినహాయించారు. ఇక మిగతా 20 గంటలు పకడ్బందీగా లాక్‌డౌన్‌ను అమలు చేశారు. కాగా మధ్యాహ్నం 2 గంటలక సమావేశమయ్యే రాష్ర్ట మంత్రివర్గం లాక్‌డౌన్‌తో పాటు ఇతర అంశాలపై చర్చించనుంది.
వర్షాకాల వ్యవసాయ సీజన్ వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యవసాయరంగంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచటం, రైతుబంధు అందజేత తదితర అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నది. ధాన్యం సేకరణ ఎంతవరకు వచ్చిందనే అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నది. దీంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖకు రూ.6295 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులు సరిపోయేలా లేవు. అందుకే కేబినేట్‌లో నిధుల పెంపుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
లాక్‌డౌన్‌పై ఇప్పటికే ప్రభుత్వం వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించింది. లాక్‌డౌన్ విధింపు వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ప్రభుత్వ పెద్దలే ప్రకటిస్తున్నారు. సెకండ్ వేవ్ విజృంభించిన మొదట్లో కరోనా కేసులు 10 వేల మార్కును దాటాయి. ఇప్పుడు ఒక్కో రోజు 90 వేలకు పైగా టెస్టులు చేసినా.. మూడు వేల పైచిలుకు కేసులే నమోదవుతున్నాయి. ఇది లాక్‌డౌన్ ఫలితమేనని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దృష్ట్యా లాక్‌డౌన్‌ను జూన్ 7 వరకు పొడిగిద్దామన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
లాక్‌డౌన్ పొడిగిస్తేనే మంచిదని కొంత మంది అభిప్రాయపడగా.. మరికొందరు పొడిగింపు వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతాయని, ఇప్పటికే 20 రోజులకు పైగా నానా తిప్పలు పడుతున్నారని ప్రభుత్వానికి చెప్పినట్లు తెలిసింది. ముఖ్యంగా కూలి పనులు చేసుకునేవారు, చిరు వ్యాపారులు ఉపాధి కరువై రోడ్డున పడుతున్నారని వివరించినట్లు సమాచారం. పైగా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు వెసులుబాటు ఇవ్వడం వల్ల తక్కువ సడలింపు సమయంలో రోడ్లపై జనం ఒకేసారి కిక్కిరిసిపోతున్నారని, మిగతా 20 గంటల పాటు లాక్‌డౌన్‌ను అమలు చేసినా ఫలితమేముందని ప్రశ్నించినట్లు తెలిసింది.