Health Survey: తెలంగాణలో ఇంటింటి హెల్త్ సర్వే చేపట్టనున్న ప్రభుత్వం, కరోనావైరస్ వ్యాప్తి కట్టడి కోసం పటిష్టమైన చర్యలు, విదేశాల నుంచి వచ్చిన వారిపై ఇంటెలిజెన్స్ నిఘా
ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వెళ్లి, ఇంటి సభ్యుల ఆరోగ్య సమాచారాన్ని సేకరించనున్నారు. రాష్ట్రంలో కనీసం 20 వేలకు పైగా మంది విదేశాల నుంచి వచ్చినట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది......
Hyderabad, March 24: తెలంగాణలో ఇప్పటికే మార్చి 31 వరకు లాక్ డౌన్ (Telangana Lockdown) విధించిన నేపథ్యంలో ప్రభుత్వం ఇక కరోనావైరస్ (COVID 19 Outbreak) కట్టిడి చర్యలను మరింత పటిష్ఠం చేయనుంది. మంగళవారం నుంచి ఇంటింటి సర్వే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వెళ్లి, ఇంటి సభ్యుల ఆరోగ్య సమాచారాన్ని (Health Survey) సేకరించనున్నారు. లాక్‌డౌన్ పట్టని జనం, పోలీసు చర్యలు కఠినతరం
రాష్ట్రంలో కనీసం 20 వేలకు పైగా మంది విదేశాల నుంచి వచ్చినట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. వీరంతా తమ 'ట్రావెల్ హిస్టరీ'ని దాచిపెట్టి, హోం క్వారైంటైన్ ప్రోటోకాల్ పాటించకుండా బయట తిరుగుతున్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారందరిని ట్రేస్ చేసి, వారు ఉన్న చోటును గుర్తించి, వారికి క్వారైంటైన్ స్టాంప్ వేయనున్నట్లు సమాచారం. పరిస్థితి తీవ్రంగా ఉంటే అందరినీ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స చేయాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది.
ఇందుకోసం ముందుజాగ్రత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 130 ఐసోలేషన్ కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో సుమారు 32 వేల పడకలున్నట్లు సమాచారం, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 15000 పడకలను మరియు కార్పోరేట్ ఆసుపత్రుల్లో మరో 1000 పడకలను ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది. కోవిడ్-19 నియంత్రణకు 'హైడ్రాక్సీక్లోరోక్విన్' ఔషధం వాడవచ్చా?
ఇక సర్వేకోసం ఆరోగ్య శాఖ సిబ్బంది, జిహెచ్‌ఎంసి, మరియు పోలీసు విభాగాలకు చెందిన సిబ్బందిని ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. రాష్ట్రంలో సుమారు 27 వేల మంది ఆశా వర్కర్లు మరియు 8 ఏఎన్ఎంలు ఉన్నారు. వీరంతా ఇంటింటి నుంచి సమాచార సేకరణ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రం కరోనాకేసుల్లో 2వ స్టేజ్ లో ఉంది, కరీంనగర్ లో ఇండోనేషియన్ బృందం ద్వారా ఇప్పటికే ఇద్దరు స్థానికులకు వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ మరియు సికింద్రాబాద్ లలో 150 ప్రత్యేక బృందాలతో ఇప్పటికే ఇంటింటి సర్వే ప్రారంభమైంది. దీనిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. విదేశాల నుంచి వచ్చిన తన కుమారుడిని క్వారైంటైన్‌కు తరలించని డీఎస్పీ, కేసు నమోదు
విదేశాల నుంచి వచ్చిన వారు తమ వివరాలు బయటపెట్టకుండా గోప్యంగా వ్యవహరిస్తుండటంతో వారిని గుర్తించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి.