Hyderabad, March 23: తెలంగాణలో సోమవారం ఉదయం నాటికి కరోనావైరస్ పాజిటివ్ కేసులు (COVID 19 Outbreak) 30కి చేరాయి. కరీంనగర్ లో ఇండోనేషియన్ బృందంతో తిరిగిన ఓ యువకుడికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో స్థానికంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకున్న తొలి కేసు ఇదే. రేపటి వరకు ఇంకా ఎంత మందికి వైరస్ అంటుకుంటుందో, ఎంత మంది జబ్బు పడతారో తెలియని పరిస్థితి.
నిన్న ఆదివారం 'జనతా కర్ఫ్యూ' ద్వారా తెలంగాణలో ప్రజలు ఆదర్శంగా నిలిచారు. 99.9 శాతం ప్రజలు ఎవరూ కూడా బయటకు రాలేదు, దీనికి విరుద్ధంగా సోమవారం కట్టలు తెంచుకున్న నదిలా ఎగబడి మరీ రోడ్ల మీదకు వచ్చేశారు. ఆదివారం సీఎం కేసీఆర్ (CM KCR) మాట్లాడుతూ ఈ జనతా కర్ఫ్యూను మార్చి 31 వరకు పాటిద్దాం అని చెబుతూ రాష్ట్రవ్యాప్త 'లాక్ డౌన్' (Telangana Lockdown) ప్రకటించారు. అయితే కొన్ని మినహాయింపులు ఉంటాయి, అత్యవసరాలు, నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులోనే ఉంటాయి. ఎవరూ ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు అన్నీ లభ్యమవుతాయి అని స్పష్టంగా చెప్పారు.
మార్చ్ 31 వరకు ఏమేమి తెరిచి ఉంటాయి? ఏమేమి మూసి ఉంటాయి?
అయినప్పటికీ, మళ్లీ దొరుకుతాయో లేదో అన్నంత కసితో ప్రజలు కూరగాయల మార్కెట్లకు భారీగా తరలివచ్చారు. సూపర్ మార్కెట్ల ఎదుట భారీ క్యూలు కట్టారు. హైదరాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రైతు మార్కెట్లు విపరీతమైన రద్దీతో కిక్కిరిసిపోయాయి. ఇంత డిమాండ్ ఉండేసరికి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏ కూరగాయలు కూడా కిలో రూ. 100 కు తక్కువ అమ్ముడుపోలేదు. మిరపకాయ కిలో రూ. 120తో మొదలై రూ. 140, రూ. 160 ఇలా పైపైకి పెరుగుతూ పోయింది. పాల రేట్లు రెట్టింపు అయ్యాయి. (Prices Hike) మళ్లీ ఇదే జనాలు ధరలు భారీగా పెరిగిపోయాయని లబోదిబోమన్నారు. ఆదిలాబాద్ మార్కెట్లో అయితే వ్యాపారులు, కొనుగోలుదారుల మధ్య ఘర్షణ చెలరేగింది. ధరలు ఎక్కువగా ఉన్నాయని కోపంతో వ్యాపారులపై స్థానికులు దాడికి దిగారు.
ఇక వాహనదారులు తమకేమీ పట్టనట్లుగా రోడ్లపైకి రావడంతో మళ్లీ ట్రాఫిక్ మొదలైంది. రోడ్లపైకి ఎవరూ రావొదన్నే నిబంధనలను లెక్కచేయడం లేదు. ఆర్టీసీ బస్సులు, మెట్రో తదితర సర్వీసులన్ని నిలిపివేయడంతో ఇదే అదనుగా, ఆటోవాలాలు, ప్రైవేట్ వాహనదారులు జనాలను పరిమితికి మించి తీసుకెళ్లడం కనిపిస్తుంది. ఒక్క తెలంగాణలోనే కాదు, వివిధ రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి. 'మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మీరే కాపాడుకోండి' దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి
ఈ నిర్లక్ష్యం పట్ల కేంద్రం సీరియస్ అయి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలకు తాజా ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ప్రజలను హెచ్చరించారు. ప్రజలకు తమకు దగ్గర్లోని దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంది. ద్విచక్ర వాహనంపై ఒక్కరు మాత్రమే కనిపించాలి, కారులో ఇద్దరికి అనుమతి ఉంటుంది. రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు రోడ్లపైకి ఎవరూ రావొద్దని, ఏ వాహనం కనిపించొద్దని ఆదేశాలు ఇచ్చారు. అధిక ధరలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి ఏదైనా వాహనం కనిపిస్తే సీజ్ చేయబడుతుందని పోలీస్ శాఖ హెచ్చరించింది.
ప్రజలు గుంపులుగా రోడ్లపైకి రావడం పట్ల ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అయితే పరిస్థితిని కట్టడి చేయలమేని ఆయన పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛంధంగా స్వీయ నిర్బంధం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.