New Delhi, March 23: ప్రపంచదేశాలలో భయానక పరిస్థితులను సృష్టిస్తున్న కరోనావైరస్ వ్యాప్తి (COVID 19 Spread), భారతదేశంలో కూడా రెండో దశలోకి ప్రవేశించింది. ఈ వైరస్ కు ఇప్పటికీ వ్యాక్సిన్ లేదు, స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గం కావడంతో మనదేశంలో పరిస్థితి మరింత ముదరకుండా ఉండేందుకు నిన్న ఆదివారం దేశవ్యాప్తంగా 'జనతా కర్ఫ్యూ' (Janatha Curfew) ను విధించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా దేశంలోని కరోనాప్రభావిత 85 జిల్లాలలో మార్చి 31 వరకు నిర్భంధం పొడగించారు, పలు చోట్ల 144 సెక్షన్ అమలు చేశారు. కరోనావైరస్ వ్యాప్తి కట్టడికోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని చాలావరకు రాష్ట్రాలు మార్చ్ 31 వరకు 'లాక్ డౌన్' (Lockdown) విధించేశాయి.
అయితే, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఉద్దేశ్యంతోనైతే జనతా కర్ఫ్యూ- లాక్ డౌన్ విధించాయో దానిని విస్మరించి ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా ప్రజలు తమ అవగాహనారాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. లాక్‌డౌన్ నియమ, నిబంధనలు ఉల్లంఘించి సోమవారం ఉదయం నుంచి ఎలాంటి రక్షణ, స్వీయ నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా రోడ్లపై తిరగడం, మార్కెట్లలో సరుకుల కోసం ఎగబడటం, గుంపులుగుంపులుగా సంచరించడం కనిపిస్తుంది. ఈ డిమాండ్ చూసి వ్యాపారులు ధరలను పెంచడం ఈరోజు చాలా చోట్ల కనిపిస్తుంది. లాక్‌డౌన్ దిశగా ఇండియా, ఇప్పటికే లాక్‌డౌన్‌లో 8 రాష్ట్రాలు
ప్రాణాంతక వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది బాధితులుగా మారి, వేల సంఖ్యలో పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రభుత్వాలు, మీడియా దీనిపై విశేషమైన ప్రచారం కల్పిస్తున్నాయి. అయినా కూడా ఏ మాత్రం భయంలేకుండా ప్రజలు అజ్ఞానంతో రోడ్లమీద తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక భారత్‌లో ఏ ప్రభుత్వం కూడా ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రజలు లాక్‌డౌన్‌ను విస్మరించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌లను తీవ్రంగా పరిగణించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దయచేసి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కుటుంబాన్ని రక్షించండి అంటూ ప్రధాని ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. లాక్‌డౌన్ అంటే ఏమిటి, ఏమి చేయవచ్చు..ఏమి చేయకూడదు
Here's the tweet:
लॉकडाउन को अभी भी कई लोग गंभीरता से नहीं ले रहे हैं। कृपया करके अपने आप को बचाएं, अपने परिवार को बचाएं, निर्देशों का गंभीरता से पालन करें। राज्य सरकारों से मेरा अनुरोध है कि वो नियमों और कानूनों का पालन करवाएं।
— Narendra Modi (@narendramodi) March 23, 2020
అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రధాని మోదీ కోరారు. ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతమైంది అయితే ఇది వేడుకలకు సందర్భం కాదు, సుదీర్ఘ యుద్ధంలో ఒక విజయం మాత్రమే. కాబట్టి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా పాటించండి, లాక్‌డౌన్‌ను సీరియస్ గా పరిగణించాలని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.
**ఇదే క్రమంలో లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.