Lockdown: లాక్‌డౌన్‌ అంటే ఏమిటి, ఏమి చేయవచ్చు..ఏమి చేయకూడదు, ఏ సర్వీసులు అందుబాటులో ఉంటాయి, లాక్‌డౌన్‌ ఎన్ని రకాలు, పూర్తి విశ్లేషణాత్మక కథనం
Deadly coronavirus What is a lockdown Here's what you can and can't do (Photo-PTI)

Mumbai, Mar 23: కరోనావైరస్ మహమ్మారి (Deadly Coronavirus) ఇప్పుడు ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. దేశాలకు దేశాలే దాని దెబ్బకు శ్మశానపు దిబ్బలుగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చైనాలో వుహాన్ లో (Wuhan in China) పుట్టిన కోవిడ్ 19 వైరస్ (COVID-19) ప్రపంచానికి పెను సవాల్ విసురుతూ భయానక వాతావరణాన్ని కల్పిస్తోంది. దీని దెబ్బకు దేశాలకు దేశాలే లాక్‌డౌన్‌ (Lockdown) విధించుకుంటున్నాయి. ఇప్పుడు ఏ దేశంలో చూసినా వినిపిస్తున్న ఒకే ఒక పదం లాక్‌డౌన్‌.

లాక్‌డౌన్ దిశగా ఇండియా, ఇప్పటికే లాక్‌డౌన్‌లో 8 రాష్ట్రాలు

మొదటగా చైనాలోని వుహాన్‌ పట్టణంలో మొదలైన ఈ లాక్‌డౌన్‌ ఇప్పుడు అన్ని దేశాల్లోకి వచ్చేసింది. ఇండియా కూడా ఇప్పుడు లాక్‌డౌన్‌ వైపు చూస్తోంది. దేశంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఇంతకీ లాక్‌డౌన్‌ (What Is Lockdown) అంటే ఏమిటీ. దాని వల్ల ఏం జరుగుతుంది. ఓ సారి చూద్దాం.

ఏదైనా ఓ విపత్తు వచ్చి పరిస్థితులు చేయి దాటుతున్నప్పుడు లాక్‌డౌన్‌ అనేది ఓ అత్యవసర నిర్వహణ నియమంగా కింద ప్రకటిస్తారు. దీనినే ప్రోటోకాల్‌ అని కూడా పిలుస్తారు. మాములు భాషలో దీని గురించి చెప్పాలంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలను నివారించడమే. ప్రభుత్వ అధికార యంత్రాంగం మాత్రమే ఈ ప్రోటోకాల్‌ను ఉపయోగించే వెసులుబాటు ఉంటుంది.

ఇటలీ మృత్యు ఘోష, కరోనా మరణాలు 5,476

తమ పరిధిలోని ప్రజలను రక్షించడానికి పాలకులు ఈ లాక్‌డౌన్‌ను ఉపయోగిస్తారు. బాహ్య ప్రదేశాల నుంచి ఏదైనా ముప్పు ముంచుకు వస్తున్నప్పుడు లేదా ఇతర బాహ్య సంఘటన నుంచి తమ ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి లాక్‌డౌన్‌ ప్రయోగిస్తారు.

ఇక భవనాలలో లాక్‌డౌన్‌ అంటే అక్కడ తలుపులకు తాళాలు వేయడం. దీనివల్ల ఏ వ్యక్తి లోపలికి రారు, బయటికి పోరు. అలాగే, పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ (ఫుల్‌ లాక్‌డౌన్‌) అంటే సాధారణంగా ప్రజలు వారు ఉన్న చోటనే ఉండాలి. ఎక్కడికీ వెళ్లకూడదు. ఒకవేళ అలా వెళితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి చెప్పిన చోటు నుంచి ఎవరూ లోపలికి వెళ్లకూడదు. బయటకు రాకూడదు.

దేశ రాజధానిలో 144 సెక్షన్‌, మార్చి 31 అర్ధరాత్రి 12 గంటల వరకు అమలులో

లాక్‌డౌన్‌ రెండు రకాలు ఉంటాయి. ఒకటి నివారణ లాక్‌డౌన్‌ (ప్రివెంటివ్‌ లాక్‌డౌన్‌), రెండోది ఎమర్జెన్సీ లాక్‌డౌన్‌. వీటి ప్రధాన ఉద్దేశం ముంచుకొచ్చే ముప్పు తీవ్రతను తగ్గించడమే.

ప్రివెంటివ్‌ లాక్‌డౌన్‌: ప్రజలు, సంస్థల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా విధించేది

ఎమర్జెన్సీ లాక్‌డౌన్‌: అసాధారణమైన పరిస్థితి లేదా విపత్తును పరిష్కరించడానికి అమలు చేసే ముందస్తు చర్య ఇది. నివారణ చర్యలలో భాగం. ప్రాణాలకు తక్షణ ముప్పు లేదా ఇతరత్రా ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు ఎమర్జెన్సీ లాక్‌‌డౌన్‌ను విధిస్తారు.

ఈ లాక్‌‌డౌన్‌ సమయంలో అత్యవసర సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. బ్యాంకు సర్వీసులు, అలాగే ఫార్మ సంబంధిత సర్వీసులు, నిత్యావసర సంబంధిత సర్వీసులు కొనసాగుతాయి. అయితే ప్రజలు కొంచెం దూరం మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. అవసరం లేని కార్యకలాపాలు మాత్రం షట్ డౌన్ అవుతాయి. ఈ రూల్స్ అతిక్రమించిన వారికి ఒక నెల జైలు శిక్ష లేకుంటే రూ. 200 నుంచి జరిమానా ఉంటుంది. లేదా రెండు శిక్షలు అమలు చేసే అవకాశం ఉంది.

ఈ లాక్‌డౌన్‌ సమయంలో అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి దగ్గర నుంచే విధులు నిర్వర్తించేలా ఆర్డర్స్ పాస్ చేస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజు వారీ కూలీలకు రిలీఫ్ ప్యాకేజీలను ప్రకటిస్తాయి.