Telangana: ప్రధాని మోదీ పాలనలో మళ్లీ కట్టెల పొయ్యి దిక్కు, దేశ ప్రజల బాధల్ని పట్టించుకునే సోయి లేదని మండిపడిన మంత్రి కేటీఆర్, పెంచిన గ్యాస్‌ ధరలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు

పెరిగిన గ్యాస్ ధ‌ర‌లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR) ఇచ్చిన పిలుపునకు తెలంగాణ వ్యాప్తంగా శ్రేణులు నిరసనలు చేపట్టారు.

TRS cadre protests across the state against centre's decision to hike LPG prices

Hyd, July 7: కేంద్రం పెంచిన గ్యాస్‌ ధరలపై తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు (TRS cadre protests) భగ్గుమన్నారు. పెరిగిన గ్యాస్ ధ‌ర‌లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR) ఇచ్చిన పిలుపునకు తెలంగాణ వ్యాప్తంగా శ్రేణులు నిరసనలు చేపట్టారు. అన్ని మండ‌ల‌, ప‌ట్టణ కేంద్రాల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిర‌స‌న కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. గ్యాస్ స్టవ్‌లపై కట్టెలు పెట్టి మోదీ ప్రభుత్వం పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోదీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పలు చోట్ల మోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు.పేదలకు పెను భారంగా మారిన పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిర‌స‌న కార్యాక్రమాల్లో పాల్గొన్నారు.

గ్యాస్ ధ‌ర‌ల పెంపుతో ( centre's decision to hike LPG prices) కేంద్ర‌ప్ర‌భుత్వ తీరుపై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ మ‌రోసారి మండిప‌డ్డారు. గ‌డియ‌కోసారి పెరుగుతున్న గ్యాస్ ధ‌ర‌ల‌తో ప్ర‌జ‌ల‌కు గుండె ద‌డ వ‌స్తోంద‌న్నారు. మోదీ పాల‌న‌లో వంట గ‌దుల్లో మంట‌లు పుడుతున్నాయ‌ని పేర్కొన్నారు. బీజేపీ ప్ర‌భుత్వం ధ‌ర‌లు పెంచి దేశ ప్ర‌జ‌ల‌పై దొంగ దాడి చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని క‌ట్ట‌డి చేయ‌లేని దౌర్భాగ్య పాల‌న‌లో దేశం ఉంద‌న్నారు. గ్యాస్ ధ‌ర పెంపుపై నిర‌స‌న చేప‌ట్టిన టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు కేటీఆర్ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. కేంద్ర అస‌మ‌ర్థ పాల‌న విధానాల‌పై నిరంత‌ర పోరు సాగిస్తామ‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు.

Here's Videos

8 సంవత్సరాల అసమర్థ మోడీ పరిపాలనలో సుమారు 170 శాతం పెంపుతో, ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక రేటుకు వంట గ్యాస్ అమ్ముతున్న ప్రభుత్వంగా ప్రపంచ రికార్డ్ సృష్టించిందని విమర్శించారు. తాజాగా పెంచిన రూ. 50తో ఈ ఏడాది కాలంలోనే రూ. 244 మేర గ్యాస్ బండ రేటును పెంచిన మోదీ పాలనను చూసి అరాచకత్వం కూడా సిగ్గుతో తలదించుకుంటుందన్నారు.

హైదరాబాద్‌లో శాఫ్రాన్ రూ.1200 కోట్ల పెట్టుబడులు, 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు, హర్షం వ్యక్తం చేసిన ఐటీ మంత్రి కేటీఆర్

2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు రూ. 410గా ఉన్న సిలిండర్ ధర ఈ రోజు సుమారు మూడు రెట్లు పెరిగి రూ. 1100 దాటడం దురదృష్టకరమన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ. 1100పైగా గ్యాస్ రేటు చేరడం బీజేపీ అసమర్థ పరిపాలనకు నిదర్శనమన్నారు. ధరేంద్ర మోడీ హయాంలో సిలిండర్ బండ ధరలతో పేదల్ని బాదే కార్యక్రమం అడ్డూ అదుపు లేకుండా సాగుతుందన్నారు. రాయితీకి రాం రాం చెప్పి..సబ్సిడీ ఎత్తేసి దేశ ప్రజలపై మోదీ దొంగ దాడి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

బీజేపీ అసమర్థ విధానాలతోనే ప్రజలకు అవసరమైన ప్రతీ వస్తువు ధర ఆకాశాన్ని అంటుతుందని అయినా కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజల బాధల్ని పట్టించుకునే సోయి లేదన్నారు. దేశ ప్రజలతో కష్టాలతో సంబంధం లేకుండా పాలిస్తున్న మోదీ రాజ్యంలో భరించలేని విధంగా ధరలు పెరిగాయన్న కేటీఆర్, కొత్త ఉద్యోగాలు రాక, ఉన్న ఉద్యోగాలు ఊడి ప్రజల ఆదాయాలు పడిపోయాయని పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై గొంతు చించుకున్న నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులంతా ఇప్పుడు తేలు కుట్టిన దొంగల లెక్క గప్ చుప్ అయ్యారని కేటీఆర్ అన్నారు.

ఉజ్వల పథకం పేరుతో తమకు అంటగట్టిన సిలిండర్ లను పెరుగుతున్న గ్యాస్ ధరలతో మహిళలు ఉపయోగించడం లేదన్న కేటీఆర్, మళ్లీ కట్టెల పొయ్యి దిక్కు చూస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ చెప్తున్న జుమ్లాలా మాదిరగానే ఉజ్వల పథకం తయారైందన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే ధరలను నియంత్రించి దొంగ నాటకాలు ఆడే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజల పట్ల సానుభూతితో వ్యవహరించి గ్యాస్ సిలిండర్ ధరని తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.