TS Monsoon Session 2021: కేంద్రంపై మండిపడిన కేసీఆర్, తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోందని ధ్వజం, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలపై కొనసాగుతున్న చర్చలు
తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోందని సీఎం ధ్వజమెత్తారు. శాసనసభలో (Telangana Assembly Monsoon Session 2021 day 4) ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం ఇచ్చిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. టూరిజంతో పాటు ఇతర విషయాల్లో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదు.
Hyd, Oct 4: రెండు రోజుల విరామం అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (TS Monsoon Session 2021) సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దళిత బంధు పథకం, హైదరాబాద్‌లో చెరువుల సుందరీకరణ, ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం, హైదరాబాద్‌లో ఈగలు, దోమల బెడద, రాష్ట్రంలో వంతెనల మంజూరు, షాద్‌నగర్‌కు ఐటీఐ తరలింపు అంశంపై ప్రశ్నోత్తారాల్లో చర్చిస్తున్నారు. ప్రయివేటు యూనివర్సిటీల చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రతిని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉభయసభల ముందు ప్రవేశపెట్టనున్నారు.
తెలంగాణ పట్ల కేంద్ర నిర్లక్ష్య వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోందని సీఎం ధ్వజమెత్తారు. శాసనసభలో (Telangana Assembly Monsoon Session 2021 day 4) ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం ఇచ్చిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. టూరిజంతో పాటు ఇతర విషయాల్లో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదు. తెలంగాణ చాలా ఉజ్వలమైన సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు.. గొప్ప కళలతో కూడుకున్న ప్రాంతం. 58 సంవత్సరాలు సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణను పట్టించుకోలేదు.
ప్రమోట్ చేయలేదు. అద్భుతమైన జలపాతాలు తెలంగాణలో ఉన్నాయి. ఖమ్మంలో పాండవుల గుట్టను పట్టించుకోలేదు. వారసత్వంలో వచ్చిన పురాతన కోటలు, దోమకొండ కోట అప్పగిస్తామని చెబుతున్నారు. చారిత్రాక ఉజ్వలమైన అవశేషాలు ఉన్న తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉంది. తెలంగాణలో కళాకారులు, విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు. పద్మశ్రీ అవార్డుల కోసం జాబితాను పంపాలా? వద్దా? అని ప్రధాని మోదీ, అమిత్ షాను అడిగాను.
ఉమ్మడి ఏపీలో అలంపూర్‌లోని జోగులాంబ టెంపుల్‌ను పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్డీఎస్ మీద అన్యాయాన్ని నిలదీసేందుకు జోగులాంబ నుంచే మొట్టమొదటిసారిగా పాదయాత్ర చేపట్టాను. కృష్ణా, గోదావరి పుష్కరాల మీద కూడా ఉద్యమం చేశాను. తెలంగాణలోని ప్రకృతి సౌందర్యాలను కాపాడుకుంటాం. మగధ సామ్రాజ్యం ఎంత విశిష్టంగా, వైభవంగా ఉండేనో.. మన శాతావాహనుల చరిత్ర కూడా అంతే గొప్పది. నూతన పరిశోధకులు శాసనాలను వెలికితీస్తున్నారు. అన్ని జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఓ కమిటీని ఏర్పాటు చేసి చారిత్రాకమైన ప్రదేశాలు, కోటలు, దర్శనీయ స్థలాలు, విశిష్టమైన దేవాయాల ప్రాచుర్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఎయిర్ స్ట్రిప్స్ ఇవ్వాలని అడిగాం. ఆరున్నర సంవత్సరాలు గడిచిపోతోంది. కేంద్రం కాలయాపన చేస్తోంది అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెరువుల అభివృద్ధి, సుందరీకరణపై మంత్రి కేటీఆర్
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో చెరువుల సుందరీకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. నగరంలోని చెరువులను పర్యవేక్షిస్తూ అభివృద్ధి చేస్తున్నాం. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సుందరీకరణ, మురుగు కాల్వల మళ్లింపు చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులలో 127 చెరువులను అభివృద్ధి పరిచేందుకు గుర్తించి, అందులో 48 చెరువులను అభివృద్ధి చేశామన్నారు.
చెరువుల అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ. 407 కోట్ల 30 లక్షలను మంజూరు చేశాం. ఇప్పటికే రూ. 218 కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. రూ. 94 కోట్ల 17 లక్షల అంచనా వ్యయంతో 63 చెరువుల సుందరీకరణను జీహెచ్ఎంసీ చేపట్టి 48 చెరువుల పనులను పూర్తి చేసింది. మిగతా 15 చెరువుల పనులు పురోగతిలో ఉన్నాయి. రూ. 282 కోట్ల 63 లక్షల అంచనా వ్యయంతో మిషన్ కాకతీయ అర్బన్ కింద 19 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టామన్నారు. రూ. 30 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో 45 చెరువుల అభివృద్ధి, వరద వల్ల దెబ్బతిన్న మరమ్మతులను జీహెచ్ఎంసీ చేపట్టింది అని కేటీఆర్ తెలిపారు.
దశాబ్దాలుగా చెరువులు కబ్జాకు గురయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువుల అభివృద్ధికి ఒక డివిజన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఒక స్పెషల్ కమిషనర్‌ను నియమిస్తాం. చెరువుల అభివృద్ధి కోసం ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. హైదరాబాద్‌లో వచ్చే రెండేళ్లలో 31 సీవరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. నాలాలపై ప్రత్యేక దృష్టి సారించాం. నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించి, వారికి వెంటనే పునరావాసం కల్పించాలని ఆలోచిస్తున్నాం. నాలాల విస్తరణకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ చెప్పారు.
రామప్ప దేవాలయం అభివృద్ధిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 25న ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తించిందని తెలిపారు. ఈ దేవాలయం ఏఎస్ఐ పరిధిలో ఉంది. పర్యాటకుల నిమిత్తం తెలంగాణ పర్యాటక శాఖ 16 కాటేజీలు, రెస్టారెంట్లను అందుబాటులోకి తెచ్చింది. యునెస్కో గుర్తింపు పొందడంతో.. విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.
విదేశీ పర్యాటకుల నిమిత్తం అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ కార్యక్రమాలు, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. రామప్పకు సమీపంలో ఉన్న కట్టడాలను, చూడదగ్గ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పురాతన కట్టడాలకు ప్రాచుర్యం లభించిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టూరిజం అభివృద్ధి జరుగుతుందన్నారు. రామప్ప పరిసర ప్రాంతాల్లో రూ. 7 కోట్లతో వసతి గృహాలు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రారంభానికి చివరి దశలో ఉన్నాయి. వారసత్వ కట్టడాలను పరిరక్షించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
త్వరలోనే సోమశిల వంతెన పనులు : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల గ్రామం వద్ద కృష్ణా నదిపై నిర్మించబోయే బ్రిడ్జి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో కొత్త బ్రిడ్జిలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 629 వంతెనలను మంజూరు చేశాం. ఇప్పటికే 372 వంతెనలు పూర్తయ్యాయి. 257 వంతెనలు పురోగతిలో ఉన్నాయి. పురోగతిలో ఉన్న వంతెనలు 2022, జూన్ నాటికి పూర్తవుతాయి. వంతెనల కోసం రూ. 3,050 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక కొత్త బ్రిడ్జిలు వచ్చాయి. స్టేట్ రోడ్డు డిపార్ట్‌మెంట్ తరపున 384 కొత్త బ్రిడ్జిలు, నాబార్డ్ నుంచి 50 కొత్త బ్రిడ్జిలు, ఆర్డీఎప్ నుంచి 43 కొత్త బ్రిడ్జిలు, ఆర్ అండ్ బీ నాన్ ప్లాన్ నుంచి 119 కొత్త బ్రిడ్జిలను మంజూరు చేసుకున్నాం. కొత్త బ్రిడ్జిల కోసం ఈ ఆరు నెలల కాలంలో రూ. 1539 కోట్లు ఖర్చు చేయడం జరిగింది.
కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పలుమార్లు నివేదికను ఇచ్చాం. మన ప్రతిపాదనకు మన్నించి ఈ బ్రిడ్జితో పాటు కల్వకుర్తి నుంచి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కృష్ణా నదిపై సోమశిల మీదుగా నంద్యాలకు మొత్తం 170 కి.మీ. పొడవునా జాతీయ రహదారి నంబర్ 167ను నోటిఫై చేశారు. సోమశిల బ్రిడ్జికి రూ. 600 కోట్లు కేటాయించడం జరిగింది. దీనికి సర్వే జరుగుతోంది. ఒక నెలలో సర్వే పూర్తవుతోంది. అనంతరం డీపీఆర్ తయారీ తర్వాత, భూసేకరణ చేపట్టి పనులు ప్రారంభిస్తామన్నారు. మొత్తంగా తొమ్మిది నెలల లోపు సోమశిల బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామన్నారు. కొల్లాపూర్ ప్రజల చిరకాల వాంఛ త్వరలోనే నెరవేరుతుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.