Heavy Rains In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన.. ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం.. తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి
ఏపీలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Hyderabad, March 18: అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాలు (Telugu States) అతలాకుతలం అవుతున్నాయి. కొన్ని చోట్ల విస్తారంగా, మరికొన్ని చోట్ల వడగళ్ల వానలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షాకాలాన్ని తలపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు ఇంకా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో (AP) పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్ తీరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అదేవిధంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈ రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తమ్మీద రానున్న 5 రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఝార్ఖండ్ నుంచి చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ఒడిశా వైపు కదిలినట్టు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఈమేరకు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, గురువారం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం( rain ) కురిసింది. మర్పల్లి మండల కేంద్రంలో వడగండ్ల వాన( Hailstorm ) పడింది. వికారాబాద్, పరిగి, పూడూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
పెళ్లి ఇంట్లో చావుమేళం, రాత్రి కూతురు పెళ్లి ఉండగా ఉదయమే చనిపోయిన తండ్రి, ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన