Khammam, March 17: మేళ తాళాలు, బాజా భజంత్రీల చప్పుళ్లు మారుమోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. బంధుమిత్రులతో సందడిసందడిగా ఉండాల్సిన ఆ ఇల్లు ఏడుపులు, శోకాలకు వేదికైంది. ఆడబిడ్డను అత్తగారింటికి పంపాల్సిన ఇంటి నుంచి.. ఇంటిపెద్దను కాటికి పంపాల్సి వచ్చింది. పెళ్లి సంబురంతో వచ్చిన బంధువులు, చావు మిగిల్చిన దుఃఖంతో వెళ్లిపోయారు. మరికొన్ని గంటల్లో బిడ్డ పెళ్లి జరగాల్సిన ఇంట్లో.. గుండెపోటు (Heart attack)తో తండ్రి హఠాన్మరణం పాలయ్యాడు. ఖమ్మం (Khammam) జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామంలో ఈ హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గట్టుసింగారం గ్రామానికి చెందిన చింతేటి అర్జున్‌రావు (42) గతంలో వీఆర్వోగా పనిచేసేవాడు.
అయితే, ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన తర్వాత వైద్య ఆరోగ్యశాఖలో ఆయన జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అర్జున్‌రావు (Arjun Rao) కుమార్తెకు పెళ్లి కుదిరింది. శుక్రవారం అర్ధరాత్రి ముహూర్తానికి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అర్జున్‌రావు పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తిచేశాడు. బంధుమిత్రులందరీకి ఆహ్వానాలు పంపాడు. గురువారం ఉదయం కూడా భార్యతో కలిసి కొందరికి ఆహ్వాన పత్రికలు ఇచ్చి వచ్చాడు. అప్పటికే దగ్గరి బంధువులంతా విచ్చేశారు.
వచ్చిన చుట్టాలు, పిల్లాపాపలతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. ఇంతలో విధికి కన్నుకుట్టింది. అర్జున్‌రావుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దాంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్జున్‌రావు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. స్థానికులు, బంధుమిత్రులను ఈ ఘటన కలచివేసింది.