Kolkata, March 17: కాంగ్రెస్ పార్టీ లేకుండా కొత్త ఫ్రంట్ (New Front) ఏర్పాటు చేయాలని మూడు ప్రధాన జాతీయ పార్టీలు నిర్ణయించాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సమాజ్‌వాదీ పార్టీ (SP), బీజూ జనతా దళ్ (BJD) దీనికి అంగీకారం తెలిపాయి. బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా దూరాన్ని కొనసాగించనున్నాయి. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ (SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, శుక్రవారం కోల్‌కతా వెళ్లారు. పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamatha benarjee)ని ఆయన కలిశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ లేకుండా కొత్త ఫ్రంట్ ఏర్పాటుపై వీరిద్దరూ చర్చించారు. మమతా బెనర్జీ కూడా ఈ వారంలో బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశం కానున్నారు. కొత్త ఫ్రంట్ గురించి ఆయనతో చర్చించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ప్రతిపక్ష పార్టీల కూటమి నేతగా చూపించే బీజేపీ ప్రయత్నాన్ని ఎదుర్కోవడమే తమ వ్యూహమని టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ తెలిపారు.
माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी ने पार्टी के वरिष्ठ नेताओं के साथ पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी जी के आवास पर की शिष्टाचार भेंट। pic.twitter.com/i0cv6GqOTZ
— Samajwadi Party (@samajwadiparty) March 17, 2023
కాగా, కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ సమాన దూరాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు అఖిలేష్ యాదవ్ (Akhilesh yadav) చెప్పారు. మమతా బెనర్జీతో సమావేశం తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. ‘బెంగాల్‌లో మమతా దీదీతో కలిసి మేం ఉన్నాం. బీజేపీ, కాంగ్రెస్.. రెండింటికీ సమాన దూరాన్ని కొనసాగించాలన్నది ప్రస్తుతం మా స్టాండ్’ అని అన్నారు.
మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటున్నదని విమర్శించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), ఆదాయపు పన్ను శాఖ (IT)తో రైడ్స్ జరిపిస్తున్నదని దుయ్యబట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కు చెందిన మనీష్ సిసోడియా, రాష్ట్రీయ జనతాదళ్(RJD) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే బీజేపీలో చేరిన ప్రతిపక్ష నేతలపై ఎలాంటి రైడ్లు ఉండవని ఎద్దేవా చేశారు. ‘బీజేపీ వ్యాక్సిన్’ పొందిన వారికి సీబీఐ, ఈడీ లేదా ఐటీ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు’ అని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు.