Exam Hall-Student Performance: ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు పరీక్ష రాస్తున్న హాల్ కూడా ముఖ్యమే.. పరీక్షలో విద్యార్థి ప్రదర్శనపై ఎగ్జామ్ హాల్ ప్రభావం.. తాజా అధ్యయనంలో వెల్లడి
పరీక్ష కోసం నెలలపాటు కష్టపడ్డా కూడా మీరు అనుకున్న ఫలితాలు రాలేదా? అయితే, మీరు పరీక్ష రాసిన గది దీనికి కారణం కావొచ్చు.
Newdelhi, July 5: పరీక్ష కోసం నెలలపాటు కష్టపడ్డా కూడా మీరు అనుకున్న ఫలితాలు రాలేదా? అయితే, మీరు పరీక్ష రాసిన గది (Exam Hall) దీనికి కారణం కావొచ్చు. అవును. ఇది నిజం. పరీక్షా గదిలో సీలింగ్ ఎత్తు, ఉష్ణోగ్రత, గాలి నాణ్యత.. ఇవన్నీ ఆ గదిలో పరీక్ష రాస్తున్న విద్యార్థుల ప్రతిభను (Student Performance) ప్రభావితం చేస్తున్నాయని దక్షిణ ఆస్ట్రేలియా, డీకెన్ యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. సీలింగ్ తక్కువ ఎత్తులో ఉన్న గదిలో పరీక్ష రాసిన విద్యార్థులతో పోలిస్తే, సీలింగ్ ఎక్కువ ఎత్తులో ఉన్న గదిలో పరీక్ష రాసిన విద్యార్థులకు.. తక్కువ మార్కులు వచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు.
అధ్యయనం ఇలా..
2011-2019 మధ్య ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన 15,400 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఫలితాల్ని పరిశోధకులు విశ్లేషించి పై నివేదికను తయారుచేశారు. పరీక్ష గది సీలింగ్ ఎత్తుకు.. అందులో పరీక్ష రాసిన విద్యార్థుల మార్కులకు ఉన్న సంబంధాన్ని పరిశీలించారు. సీలింగ్ ఎత్తు ఎక్కువగా ఉన్న గదుల్లో విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చినట్టు వారి పరిశీలనలో తేలింది. ఉష్ణోగ్రత, గాలి నాణ్యత కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్టు వెల్లడించారు.