Monkey Treating Wound in World First: మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా పసరు వైద్యం చేసుకుంటయ్... ఏ మొక్కలో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో వాటికి బాగా తెలుసు... తనకు తగిలిన గాయాన్ని మాన్పించుకునేందుకు ఆకు పసరుతో స్వీయ చికిత్స చేసుకున్న ఓ కోతి.. ప్రపంచంలోనే తొలిసారిగా రికార్డ్ చేసిన ఇండోనేషియా పరిశోధకులు
మనుషులకే కాదు అడవుల్లో జీవించే మూగ జీవులకు కూడా మొక్కలు, మూలికల్లో ఉండే ఔషధ గుణాలేమిటో తెలుసు.
Newdelhi, May 4: మనుషులకే కాదు అడవుల్లో జీవించే జంతువులకు (Wild Animals) కూడా మొక్కలు (Plants), మూలికల్లో ఉండే ఔషధ గుణాలేమిటో తెలుసు. అంతేకాదు.. గాయాలు అయినప్పుడు వాటిని మాన్పించుకోవడానికి ఆ చెట్ల ఆకుల పసరుతో వాటికవే వైద్యం చేసుకుంటాయి. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ విషయాన్ని ఇండోనేషియాలో పరిశోధకులు రికార్డు చేశారు. సుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని ఒక మగ కోతి ఈ విధంగా వైద్యం చేసుకుంటున్న విషయాన్ని పరిశోధకులు గుర్తించారు.
అసలేం జరిగిందంటే??
సుమత్రన్ ఒరాంగుటాన్స్ (Orangutan) జాతికి చెందిన రెండు మగ కోతులకు భీకరమైన కొట్లాట జరిగింది. ఈ కొట్లాటలో ఒక కోతి ముఖానికి గాయమైంది. దీంతో అది ఫైబ్రూరియా టింక్చర్ అనే మొక్కల ఆకులను చేతులతో నలిపి గాయమైన చోట ఆ ఆకు పసరు పూసుకొని స్వీయవైద్యం చేసుకున్నది. అంతేకాదు.. మరికొన్ని నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. గాయం త్వరగా మానేందుకు, నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ కోతి సాధారణం కంటే ఎక్కువ సేపు పడుకుంది కూడా. ఇలా.. గాయాలు అయినప్పుడు వాటిని మాన్పించుకోవడానికి చెట్ల ఆకుల పసరుతో సుమత్రన్ ఒరాంగుటాన్స్ వాటికవే వైద్యం చేసుకుంటున్నట్టు ఇండోనేషియా పరిశోధకులు గుర్తించారు. కాగా, కోతి వినియోగించిన మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయని, మలేరియా, విరేచనాలు, మధుమేహం తదితర వ్యాధుల చికిత్సలో ఈ మొక్కలు వాడుతారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.