BRS Logo

Hyderabad, May 03: న‌ల్ల‌గొండ – ఖ‌మ్మం – వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ఏనుగుల‌ రాకేశ్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ మేర‌కు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్ర‌క‌టించారు. 2023, న‌వంబ‌ర్ 4వ తేదీన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మక్షంలో రాకేశ్ రెడ్డి గులాబీ కండువా క‌ప్పుకున్నారు. రాకేశ్ రెడ్డి సొంతూరు.. హన్మకొండ జిల్లాలోని హాసన్‌ప‌ర్తి మండలం వంగపహాడ్. సామాన్య రైతు కుటుంబం నుంచి వ‌చ్చిన రాకేశ్ రెడ్డి.. బిట్స్ పిలానీలో మాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ స్ట‌డీస్, మాస్ట‌ర్స్ ఇన్ ఫైనాన్స్ పూర్తి చేశారు. సిటీ బ్యాంక్ మేనేజర్‌గా, జేపీ మోర్గాన్, ఫేస్‌బుక్ లాంటి పలు అంతర్జాతీయ కార్పోరేట్ కంపెనీల్లో బెంగళూరు, అమెరికాలలో ఏడేళ్ల పాటు ఉన్నతస్థాయిలో ఉద్యోగాలు చేసిన ఆయ‌న‌ రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు.

 

2013లో బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, రెండు పర్యాయాలు రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. బీజేపీలో వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించిన రాకేష్ రెడ్డి వరంగల్ కేంద్రంగా అనేక ఆధ్యాత్మిక, సామాజిక, సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి చొచ్చుకెళ్ళారు. కానీ బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించ‌క‌పోవ‌డంతో 2023, న‌వంబ‌ర్‌లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉన్నత విద్యావంతుడు, మంచి వాగ్ధాటి, క్లీన్ ఇమేజ్‌తో పాటు, క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఫలితాలు రాబట్టగల సమర్ధత, కష్టపడి పనిచేసే సొంత టీమ్ ఉంటడం వారికి కలిసొచ్చే అంశాలు. యువతలో, విద్యావంతులలో మంచి పట్టున్న రాకేష్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, ఫాలోయింగ్ ఉండటంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేసీఆర్ ప్ర‌క‌టించారు.