Telcos Face Challenges: కొత్త సంవత్సరంలో టెలికాం సంస్థలకు జంట సమస్యలు, టారిఫ్ పెంపు, స్టార్ లింక్ భయాలతో అయోమయంలో సంస్థలు
2024 పొడవునా దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణకు ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి.
Mumbai, DEC 29: దేశంలో ప్రస్తుతం 5జీ సేవలు (5G Service) విస్తరిస్తున్న వేళ.. ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు (Telecom Operators) ఆయా సేవల కోసం మౌలిక వసతులు, రేడియో వేవ్ స్పెక్ట్రం కోసం భారీగానే పెట్టుబడులు పెట్టాయి. అలా పెట్టిన పెట్టుబడులను రికవరీ చేయాలంటే ఆయా డేటా ప్లాన్లకు అనుగుణంగా చార్జీలు విధిస్తాయి. అయితే కొత్త వసంతం 2025లో దేశీయ టెలికం సంస్థలకు జంట సవాళ్లు ఎదురు కానున్నాయి. పెట్టుబడుల రికవరీకి టారిఫ్ పెంపు, ఎలన్ మస్క్ వంటి బిలియనీర్ల స్టార్ లింక్ వంటి శాటిలైట్ ప్లేయర్ల నుంచి వస్తున్న పోటీని దీటుగా ఎదుర్కొనే సత్తా కలిగి ఉండాలి. 2024 పొడవునా దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణకు ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఆ పెట్టుబడులతోపాటు తమ లాభాలను యధాతథంగా కాపాడుకునేందుకు జూన్ నెలలో పెంచిన రీచార్జీ ప్లాన్ల ధరలు ఎదురు తిరగడం టెలికం ఆపరేటర్లకు కొత్త సంవత్సరంలో సవాల్‌గా పరిణమించింది. రిలయన్స్ జియో (Jio), భారతీ ఎయిర్ టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) సంస్థలు 10-20 శాతం మధ్య డేటా ప్లాన్ల చార్జీలు పెంచేశాయి. ఫలితంగా ఈ మూడు సంస్థలకు చెందిన రెండు కోట్ల మంది సబ్ స్క్రైబర్లు తమ నెట్ వర్క్‌ను మార్చేసుకున్నారు. ఫలితంగా జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంయుక్తంగా 2.6 కోట్ల మంది సబ్ స్క్రైబర్లను కోల్పోయాయి.
అంతే కాదు ఇప్పటికీ 3జీ సర్వీసులు అందిస్తూ.. ప్రస్తుతం 4జీ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించడానికి సాగుతున్న బీఎస్ఎన్ఎల్ వైపు 68 శాతం కస్టమర్లు షిఫ్ట్ అయిపోయారు. సబ్‌స్క్రైబర్లను కోల్పోయినా ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు తమ పెట్టుబడులను రికవరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు భవిష్యత్ వృద్ధి కోసం 5జీ సేవల కోసం మరికొంత పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సైతం ప్రైవేట్ టెలికం ఆపరేటర్ల చార్జీల పెంపును సమర్థించారు. పెట్టుబడులు రికవరీ చేసుకోవడం తప్పేమీ లేదన్నారు.
ఇదిలా ఉంటే, శాటిలైట్ బ్రాడ్ బాండ్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి దేశీయ ప్రైవేట్ టెలికం ఆపరేటర్లకు కొత్త ముప్పు ఎదురు కానున్నది. సబ్ స్క్రైబర్లను కోల్పోవడం 5జీ విస్తరణకు భారీ పెట్టుబడులు పెట్టడంతోపాటు ఆరోగ్య కరమైన లాభాల సాధన ఒక్కటే సమస్య కాదు.. ఎలన్ మస్క్ సారధ్యంలోని స్టార్ లింక్ వంటి శాటిలైట్ బ్రాడ్ బాండ్ సర్వీస్ ప్రొవైడర్లకు వేలం లేకుండా అడ్మినిస్ట్రేటివ్ స్పెక్ట్రం కేటాయింపును ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో సారధ్యంలో ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. వేలం లేకుండా స్పెక్ట్రం కేటాయించడం వల్ల 2జీ గేట్ లో రూ.1.76 లక్షల కోట్ల నిధులు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిన సంగతి జ్యోతిరాదిత్య సింధియా గుర్తు చేశారు. అయితే స్టార్ లింక్ వంటి సంస్థలు తమకు స్పెక్ట్రం కేటాయింపు కోసం కేంద్రం వద్ద గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నాయి.
మరోవైపు, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు భారీ రుణ భారంలో చిక్కుకున్నాయి. ఈ సమస్య నుంచి బయట పడేందుకు మూడేండ్ల పాటు 4జీ, 5జీ నెట్ వర్క్ పరికరాలు సరఫరా చేసేందుకు నోకియా, ఎరిక్సన్, శాంసంగ్ సంస్థలకు రూ.30 వేల కోట్ల కాంట్రాక్ట్ అప్పగించడం గమనార్హం. ఇక టెలికం కంపెనీలకు పరికరాల చోరీ కూడా ఒక దెబ్బగానే ఉంది. యూజర్లకు నాణ్యమైన మొబైల్ సర్వీసులు అందించడానికి టెలికం సంస్థలు ఇప్పటికే 800 కోట్ల మేరకు నష్టపోయాయని అంచనా. 5జీ సేవలను వినియోగించుకుని సైబర్ మోసగాళ్లు చేసే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు 2024లో చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఏఐ సేవలతో మనీ దోపిడీ, సైబర్ మోసాలను అరికట్టేందుకు డిజిటల్ అరెస్ట్ వంటి వ్యూహాలు అమలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.