Israeli Air Strike On School: గాజాలో స్కూల్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయిల్ సైన్యం, ఏడుగురు మృతి, భీతావహంగా దృశ్యాలు
ఇజ్రాయెల్ సైన్యం దాడుల నేపథ్యంలో మృతులంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, పాఠశాల ఆవరణలో ఉగ్రవాదులను ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఆదివారం ఉదయం సమయంలో కాఫర్ ఖాస్సెమ్ పాఠశాలపై దాడి జరిగిందని పాలస్తీన అధికారులు తెలిపారు.
Gaza., SEP 22: గాజా నగరంలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైన్యం దాడుల నేపథ్యంలో మృతులంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, పాఠశాల ఆవరణలో ఉగ్రవాదులను ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఆదివారం ఉదయం సమయంలో కాఫర్ ఖాస్సెమ్ పాఠశాలపై దాడి జరిగిందని పాలస్తీన అధికారులు తెలిపారు. మరణించిన వారిలో హమాస్ పబ్లిక్ వర్క్స్ అండ్ హౌసింగ్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మాజెద్ సలీహ్ సైతం ఉన్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDA) ప్రకారం.. దాడి హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నామని.. పౌర ప్రాణనష్టాన్ని తగ్గించడానికి వైమానిక నిఘా, ఇతర చర్యలను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ భవనాలను సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఇజ్రాయెల్ చేసిన వాదనలను హమాస్ తిరస్కరించింది. అదే సమయంలో తమ యోధులు ఇజ్రాయెల్ దళాలపై అనేక దాడులు చేశారని హమాస్ సాయుధ విభాగం తెలిపింది. ప్రస్తుతం అవసరమైన విడి భాగాలు, ఇంధనం కొరత కారణంగా అన్ని ఆసుపత్రుల్లో సేవలు పది రోజుల్లో ఆగిపోవచ్చని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. సెంట్రల్ గాజా స్ట్రిప్ నగరమైన డెయిర్ అల్-బలాలో నిర్వాసిత మహిళ మాట్లాడుతూ భారీ వర్షాలు తాత్కాలిక శిబిరాలను కూడా ముంచెత్తాయని ఆవేదన వ్యక్తం చేసింది. రోజంతా వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని.. కొత్తగా గుడారాలు ఏమీ వద్దని.. యుద్ధం ముగియాలని కోరుకుంటున్నామన్నారు. దాదాపు పది లక్షల మంది ప్రజలు దీర్ అల్-బలాహ్‌లో ఆశ్రయం పొందుతున్నారు.