Omicron Scare in US: అమెరికాలో ఒమిక్రాన్ కల్లోలం, ప్రజలంతా బూస్టర్ డోస్ వేసుకోవాలని జోబైడెన్ ఆదేశాలు, అమెరికాలోకి అడుగుపెట్టేవారికి కొత్త ఆదేశాలు జారీ చేసిన బైడెన్ సర్కారు
ఇప్పటివరకు దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు (Omicron Scare in US) నమోదయినట్లుగా తెలుస్తోంది. అమెరికాలో తొలికేసు నవంబర్ 25న కాలిఫోర్నియాలో నమోదు కాగా అది ఇప్పుడు అది మిన్నెసొటా, న్యూయార్క్, కొలరాడోకు విస్తరించింది.
Bethesda, December 3: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అమెరికాలో వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటివరకు దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు (Omicron Scare in US) నమోదయినట్లుగా తెలుస్తోంది. అమెరికాలో తొలికేసు నవంబర్ 25న కాలిఫోర్నియాలో నమోదు కాగా అది ఇప్పుడు అది మిన్నెసొటా, న్యూయార్క్, కొలరాడోకు విస్తరించింది. ఆఫ్రికా దేశాల నుంచి కాలిఫోర్నియాకు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ రాగా, దేశీయంగా తొలి కేసు మిన్నెసొటాలో నమోదయిందని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.
న్యూయార్క్‌లో ఇప్పటివరకు ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 67 ఏండ్ల మహిళ కూడా ఉన్నారని, స్వల్ప లక్షణాలతో ఆమె బాధపడుతున్నారని చెప్పారు. ఆమె ఈమధ్యే దక్షిణాఫ్రికా వెళ్లి నవంబర్ 25న ఆమె అమెరికాకు తిరిగి వచ్చారని, గత మంగళవారం ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. ‘వ్యాక్సిన్ తీసుకోండి. బూస్టర్ డోస్ తీసుకోండి. మాస్క్ ధరించండి’ అని న్యూయార్క్ గవర్నర్ క్యాథి హోచుల్ ట్వీట్ చేశారు. మిన్నెసొటాకు చెందిన వ్యక్తి న్యూయార్క్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్సులో పాల్గొన్నాడని, అతనికి పాజిటివ్ వచ్చిదని చెప్పారు. అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాడని వెల్లడించారు.
ఒమిక్రాన్ వేరియంట్ భయాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం నిబంధనలు కఠినం చేసింది. విదేశాల నుంచి అమెరికా చేరుకునే ఆ దేశ పౌరులు, విదేశీయులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలంటూ జో బైడెన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి అమెరికాకు చేరుకునే వారు తమతో పాటు 24 గంటల ముందు జారీ చేసిన కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. గతంలో 72 గంటలుగా ఉన్న నిబంధనను ఒక రోజుకి కుదించారు.
గడిచిన పద్నాలుగు రోజులుగా దక్షిణాఫ్రికాతో పాటు ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రయాణించిన వారికి అమెరికాలోకి ఎంట్రీ లేదు. అయితే అమెరికన్ సిటిజన్లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. విమానాశ్రయాల్లో కోవిడ్ టెస్టులకు తప్పనిసరిగా హాజరు కావాలి. విమానంతో పాటు బస్సు, రైలు, క్యాబ్‌లలో సైతం మాస్కు ధరించాలనే నిబంధన అమల్లోకి తెచ్చారు. మార్చి 18 వరకు ఈ రూల్ కొనసాగుతుంది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (US President Joe Biden) అమెరిక్లనకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ (Booster Shots) తీసుకోవాలని పిలుపునిచ్చారు. షట్‌డౌన్‌లు మరియు లాక్‌డౌన్‌లు ఉండవని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. ప్రస్తుత U.S. పాలసీ ప్రకారం దాదాపు 100 మిలియన్ల అమెరికన్లు బూస్టర్‌లకు అర్హులు. ప్రతిరోజూ ఎక్కువ మంది అర్హులు అవుతారని ఆరోగ్యశాఖ తెలిపింది. టీకాలు వేయని దాదాపు 43 మిలియన్ల వయోజన అమెరికన్లకు టీకాలు వేయడం కంటే టీకాలు వేసిన వారిని మరో డోస్ పొందేలా ఒప్పించడం సులభం అని అధికారులు భావిస్తున్నారు.