USA Plane Tragedy: టెక్సాస్‌లోని శాన్ యాంటోనియో ఎయిర్‌పోర్టులో దారుణం.. గాలితోపాటూ వర్కర్‌ను కూడా లోపలికి పీల్చేసుకున్న విమానం ఇంజిన్.. వర్కర్ దుర్మరణం
విమానం ఇంజిన్‌లో పడి ఓ వర్కర్ దుర్మరణం చెందారు. టెక్సాస్‌లోని శాన్ యాంటోనియో విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది.
Newyork, June 27: అమెరికాలో (America) ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. విమానం ఇంజిన్‌లో (Plane Engine) పడి ఓ వర్కర్ (Worker) దుర్మరణం చెందారు. టెక్సాస్‌లోని (Texas) శాన్ యాంటోనియో విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. లాస్ ఏంజలెస్ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం ఎరైవల్ గేటు వద్దకు చేరుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పటికి విమానంలోని ఒక ఇంజిన్ ఆన్‌లోనే ఉంది. ఈ క్రమంలోనే ఇంజిన్, గాలితోపాటూ వర్కర్‌ను కూడా లోపలికి పీల్చేసుకుంది. దీంతో, అతడు అక్కడికక్కడే మరణించాడు. కాగా, ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ విచారం వ్యక్తం చేసింది. తమ గుండె పగిలిందని వ్యాఖ్యానించింది. మృతుడు యూనిఫీ అనే సంస్థలో పనిచేసేవాడు. ఈ సంస్థ విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్‌కు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో యూనిఫీ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని నేషనల్ సేఫ్టీ ట్రాన్స్ పోర్టు బోర్డు తేల్చింది. ఘటన జరిగిన సమయంలో భద్రతాపరమైన నిబంధనల ఉల్లంఘన జరగలేదని పేర్కొంది.
అలబామాలో కూడా..
గతేడాది అలబామాలోని విమానాశ్రయంలోనూ ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ ఉద్యోగిని విమానం ఇంజిన్ లోపలికి లాగేసుకోవడంతో అతడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అనంతరం అధికారులు సదరు విమానయాన సంస్థపై రూ.12.80 లక్షల జరిమానా విధించారు.