Kinetic E-Luna | pic: Kinetic Green Official

Kinetic E-Luna: ఒకప్పటిక్ ఐకానిక్ లూనా మోపెడ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతార్‌లో వచ్చేసింది. ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ భారత మార్కెట్లో E-Luna ను ప్రవేశపెట్టింది. దీని ధరను ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 70,000/- గా నిర్ణయించారు. అయితే ఈ ఎలక్ట్రిక్ లూనాను X1 మరియు X2 అనే రెండు వేరియంట్లలో విడుదల చేశారు. ఇందులో X1 బేస్ వేరియంట్‌కు ధర రూ. 69,990 కాగా, X2 వేరియంట్ కోసం ధర రూ. 74,990/- (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

E-Luna సుస్థిర రవాణా దిశగా  మార్పులో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. ఈ సరికొత్త కైనెటిక్ E-Luna భారత మార్కెట్లో TVS XL100 మోపెడ్ తో పోటీపడుతుంది.

ఈ E-Luna కోసం గణతంత్ర దినోత్సవం నాడు బుకింగ్‌లు ప్రారంభించంగా, ఇప్పటివరకు సుమారు 40 వేలమందికి పైగా వినియోగదారులు దీని కోసం ఆసక్తి చూపించినట్లుగా కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు, CEO అయిన సులజ్జ ఫిరోడియా మోత్వాని పేర్కొన్నారు.

E-Luna ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

E-Luna ఒకప్పటి వింటేజ్ లుక్ ను కలిగి ఉండటంతో పాటు కొన్ని అత్యాధునిక ఫీచర్లను మిళితం చేసుకొని వచ్చింది. డిజైన్ పరంగా ఏకరీతిగా బాడీ పెయింట్, వృత్తాకార హెడ్‌ల్యాంప్, డ్యూయల్-ట్యూబ్యులర్ స్టీల్ చట్రంను కలిగి ఉంది. 150 కిలోల పేలోడ్ సామర్థ్యంతో అందిస్తున్నారు.

ఈ ఎలక్ట్రిక్ మోపెడ్‌లో 2.0 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. 22 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. గంటకు 50 కిమీ గరిష్ఠ వేగంతో ప్రయాణించగలదు. అంతేకాకుండా దీని బ్యాటరీ ప్రతి పూర్తి ఛార్జ్‌కు 110 కిమీల ప్రయాణ పరిధిని అందిస్తుంది. సుమారు 4 గంటలలో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

మరిన్ని ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఈ-లూనా పూర్తిగా డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, సైడ్-స్టాండ్ సెన్సార్, USB ఛార్జింగ్ పోర్ట్ తో పాటు  అవసరమైన వస్తువులను తీసుకెళ్లడానికి అనుకూలమైన బ్యాగ్ హుక్స్‌ను కలిగి ఉంది. సామాగ్రిని తీసుకెళ్లటానికి అనుగుణంగా దీని వెనుక సీటును సులభంగా వేరుచేయవచ్చు. కస్టమర్లు వివిధ రకాల ఉపకరణాలతో E-లూనాను కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు.

సరికొత్త E-Luna మల్బరీ రెడ్, ఓషన్ బ్లూ, పెర్ల్ ఎల్లో, స్పార్క్లింగ్ గ్రీన్,  నైట్ స్టార్ బ్లాక్ అనే ఐదు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.

దేశంలోని అన్ని కైనెటిక్ గ్రీన్ డీలర్‌షిప్‌ల నుండి E-Luna ను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా సరికొత్త E-Luna కోసం అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు.