Uttar Pradesh Phase 5 Polls Updates:యూపీలో కొనసాగుతున్న ఐదో దశ పోలింగ్, 61 స్థానాల్లో ఎన్నికల సమరం, అయోధ్య, రాయ్‌బరేలీ, అమేథీ సహా పలు కీలక ప్రాంతాల్లో బారులు తీరిన ఓటర్లు
యూపీలోని 12 జిల్లాల్లోని 61 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఐదో దశలో భాగంగా (Phase 5 Polls) ఉదయం 7 గంటలకే ఓటింగ్ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అజయ్‌కుమార్ శుక్లా (Ajaykumar Shukla) తెలిపారు.
Lucknow, Feb 27: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Uttar Pradesh Elections) ఐదవ దశ పోలింగ్ కొనసాగుతోంది. యూపీలోని 12 జిల్లాల్లోని 61 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఐదో దశలో భాగంగా (Phase 5 Polls) ఉదయం 7 గంటలకే ఓటింగ్ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అజయ్‌కుమార్ శుక్లా (Ajaykumar Shukla) తెలిపారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఐదవ దశ ఎన్నికల్లో 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 693 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో 90 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఓటింగ్‌లో (Voting) 2.25 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఇందులో 1.20 కోట్ల మంది పురుషులు, 1.05 కోట్ల మంది మహిళలు, 1727 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని శుక్లా చెప్పారు.
ఐదో విడత ఎన్నికల్లో మొత్తం 25,995 పోలింగ్ కేంద్రాలు, 14030 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, కోవిడ్-19 దృష్ట్యా అత్యధిక ఓటర్ల సంఖ్య చేరుకునేవరకు ఉండేలా భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంప్‌లు , మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు ఉండేలా చూసుకున్నట్లు చెప్పారు.
పోలింగ్‌పై నిఘా ఉంచేందుకు 60 మంది సాధారణ పరిశీలకులు, 11 మంది పోలీసు పరిశీలకులు, 20 మంది వ్యయ పరిశీలకులను కూడా కమిషన్ నియమించినట్లు ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. దీంతో పాటు 1941 మంది సెక్టార్ మెజిస్ట్రేట్లు, 250 మంది జోనల్ మేజిస్ట్రేట్లు, 207 మంది స్టాటిక్ మెజిస్ట్రేట్లు, 2627 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సీనియర్ జనరల్ అబ్జర్వర్, సీనియర్ పోలీస్ అబ్జర్వర్, ఇద్దరు సీనియర్ వ్యయ పరిశీలకులను కూడా కమిషన్ నియమించిందని, వీరు ఆ ప్రాంతంలోనే ఉండి మొత్తం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తారని చెప్పారు.
ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు 6348 భారీ వాహనాలు, 6630 తేలికపాటి వాహనాలు, 114089 పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాలకు నాలుగో విడతల్లో 231 స్థానాలకు ఇప్పటికే పోలింగ్ పూర్తవ్వగా.., ఆదివారం 61 స్థానాలకు పోలింగ్ అనంతరం 292 స్థానాలకు పోలింగ్ పూర్తవుతుందని చెప్పారు. మార్చి 3, 7 తేదీల్లో చివరి రెండు దశల్లో 111 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఐదో దశలో సుల్తాన్‌పూర్, చిత్రకూట్, ప్రతాప్‌గఢ్, కౌశాంబి, ప్రయాగ్‌రాజ్, బారాబంకి, అయోధ్య, బహ్రైచ్, శ్రావస్తి, గోండా, అమేథీ, రాయ్ బరేలీ జిల్లాల్లో పోలింగ్ జరుగుతుంది. ఐదవ దశలో ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తన సొంత జిల్లా కౌశాంబిలోని సిరతు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వీరిపై సమాజ్‌వాదీ పార్టీ అప్నాదళ్ (కమ్యూనిస్ట్) నాయకురాలు పల్లవి పటేల్‌ను పోటీకి దింపింది.