Lucknow, Feb 10: ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. తొలి దశలో 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ (Uttar Pradesh Assembly Elections 2022) జరుగనున్నది. మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో తొమ్మిది మంది మంత్రుల భవితవ్యం తేలనుంది. 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 412 కంపెనీలకు చెందిన 50 వేల మంది కేంద్ర పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు.
2017లో పశ్చిమ యూపీలోని ఈ 58 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 53, ఎస్పీ 2, బీఎస్పీ 2, ఆరెల్డీ ఒక సీటును గెలుచుకున్నాయి. ఇక్కడ జాట్ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమంలో వీరు ప్రధాన పాత్ర పోషించారు. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి గురువారం నుంచి మార్చి 7 మధ్య ఏడు విడుతల్లో పోలింగ్ జరుగనున్నది. మిగతా నాలుగు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, గోవాలో 14న, పంజాబ్‌లో 20న, మణిపూర్‌లో ఈ నెల 27, మార్చి 3న పోలింగ్ జరుగనున్నది. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.
షామ్లీ జిల్లా కలెక్టర్ జస్జిత్ కౌర్ మాట్లాడుతూ.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు సంబంధించి ఫిర్యాదులు అందాయని, ఈవీఎంల సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందని, ఎక్కడా శాంతిభద్రతల సమస్య లేదని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగులో (Uttar Pradesh Assembly Elections 2022 Phase 1) భాగంగా కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ఎస్పీ సింగ్ బాఘేల్ గురువారం ఉదయం ఆగ్రా నగరంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి ఎస్పీ సింగ్ బాఘేల్ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై మెయిన్ పురి కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటల వరకు 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఆగ్రా రూరల్ బీజేపీ అభ్యర్థి బేబీ రాణి మౌర్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుపరిపాలన కోసం ఓటర్లు బీజేపీ అనుకూలంగా ఓటు వేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. భారీ ఎత్తున తరలివచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ, ఎలాగైనా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ పట్టుదలగా ఉండగా, గణనీయమైన స్థానాలకు గెలుచుకుని పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్ పోరాడుతోంది. ఉనికి కాపాడుకోవడానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రయత్నిస్తున్నారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమ ప్రభావం ఈ ఎన్నికలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.