Lucknow, Feb 9: యూపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల సమరం (Uttar Pradesh Elections 2022) మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో పార్టీలు తమ మ్యానిఫెస్టోని విడుదల చేసే పనిలో పడ్డాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Congress leader Priyanka Gandhi Vadra) బుధవారం విడుదల చేశారు. రైతు రుణాల మాఫీ, 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వంటి హామీలను అందులో ప్రకటించారు.
ప్రజలు కోరుకున్న విధంగా తమ మ్యానిఫెస్టో(Congress manifesto) ఉందని ప్రియాంక అన్నారు. అధికారంలోకి రాగానే ఛత్తీస్‌గఢ్‌లో మాదిరిగా రైతు రుణాలను మాఫీ చేస్తామన్నారు. ధాన్యం, గోధుమలు క్వింటాల్‌కు రూ.2,500, చెరకు క్వింటాల్‌కు రూ.400 చొప్పున కొనుగోలు చేస్తామని తెలిపారు. విద్యుత్ బిల్లులు సగానికి తగ్గించడంతోపాటు కరోనా కాలం నాటి బకాయిలను రద్దు చేస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మాదిరిగా గోధాన్ న్యాయ్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. పాత్రికేయులపై తప్పుడు కేసులను ఉపసంహరించుకుంటామని కూడా హామీ ఇచ్చారు.
అలాగే కరోనా వల్ల బాగా దెబ్బతిన్న కుటుంబాలకు రూ.25,000 చొప్పున ఆర్థిక సహాయం ఇస్తామని మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇచ్చింది. 8 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనతోపాటు 12 లక్షల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది.
Congress leader Priyanka Gandhi Vadra launches the Congress manifesto 'Unnati Vidhan Jan Ghoshna Patra-2022' for #UttarPradeshElections pic.twitter.com/63uoNspG9x
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 9, 2022
ప్రజలకు పది లక్షల వరకు ఉచితంగా చికిత్స, మహిళా పోలీసులకు సమీపంలోనే పోస్టింగ్, కరోనా వారియర్లకు రూ.50 లక్షల పరిహారం, అడ్‌హక్ టీచర్ల రెగ్యులైజేషన్, స్కూల్ వంట వారికి రూ.5,000 జీతం వంటి హామీలను ఈ సాధారణ మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చింది. మహిళలు, యువత కోసం రెండు మ్యానిఫెస్టోలను ప్రియాంక గాంధీ ఇప్పటికే ప్రకటించారు. గురువారం తొలి దశ పోలింగ్ ప్రారంభానికి ముందు అన్ని రంగాల ప్రజల కోసం మూడోదైన సాధారణ మ్యానిఫెస్టోను ఆమె విడుదల చేశారు.