Do Or Die In Huzurnagar Bypoll: హుజూర్ నగర్‌లో 144 సెక్షన్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నికల కమిషన్ షాక్, బెదిరింపులకు భయపడమంటున్న కాంగ్రెస్ నేత, పలుచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు

ఇక్కడ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. తొలి మూడు గంటల్లో దాదాపు 15 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి గొడవలు లేకుండా అంతా సాఫీగానే పోలింగ్ జరుగుతోంది.

TRS and Congress in do-or-die mission in Huzurnagar assembly by-election (photo-Facebook)

Suryapet, October 21: తెలంగాణా రాష్ట్రంలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఇక్కడ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. తొలి మూడు గంటల్లో దాదాపు 15 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి గొడవలు లేకుండా అంతా సాఫీగానే పోలింగ్ జరుగుతోంది. కాగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు నియోజకవర్గ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నేరేడుచర్ల మండలంలోని చింతబండలో రెండు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌ను నిలిపివేసి... అధికారులు ఈవీఎంలను సరిచేస్తున్నారు. ప్రధాన పార్టీలకు కీలకంగా మారిన ఈ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని పార్టీల నేతలు పరిశీలిస్తున్నారు.జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలను.. పోలింగ్ తీరును పరిశీలించారు. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్‌ బందోబస్తు చేపట్టారు. రికార్డు స్థాయి పోలింగ్ నమోదు చేయమంటున్న ప్రధాని మోడీ

ఉప ఎన్నికలో 2,36,842 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం మొత్తం 302 పోలింగ్‌ కేంద్రాల్లో 1708 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. అంతేకాకుండా ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఉదయం 9గంటల వరకు 14శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 79 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి.. ఆయా చోట్ల మైక్రో అబ్జర్వర్లను నియమించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఏకైక ఉప-ఎన్నిక కావడంతో హుజూర్‌నగర్‌‌లో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.  ఈ నెల 24న ఫలితాలు విడుదల

పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం

గతంలో ఇక్కడ 88శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి ఉపఎన్నిక కావడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవటం..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ నుండి ఆయన సతీమణి పద్మావతి బరిలో ఉన్నారు. కాగా, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సైదిరెడ్డిని తమ అభ్యర్థిగా నిలబెట్టింది. శానంపూడి సైదిరెడ్డి మట్టంపల్లి మండలం గుండ్లపల్లిలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. బీజేపీ కోటా రామారావుకు బీఫాం ఇచ్చి బరిలో నిలిపింది. ఇక ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక కేసీఆర్‌ సర్కారుకు సవాలుగా మారింది. కార్మికులను పట్టించుకోకుండా నియంతృత్వ ధోరణి అనుసరిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ఎన్నిక ఫలితాలను రిఫరెండంగా తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇక్కడి ఆర్టీసీ కార్మికుల ఓటింగ్ పైన పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈసీ షాక్

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు ముందు కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది. హుజూర్‌నగర్‌ నుంచి వెళ్లిపోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ఎన్నికల సంఘం ఆదేశించింది. స్థానికేతరుడైన ఉత్తమ్‌ను హుజూర్‌నగర్‌ నుంచి బయటకు పంపాలని ఈసీఐ, హైదరాబాద్‌లో సీఈవో, రిటర్నింగ్‌ అధికారులకు టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది. కోదాడలో నివాసముంటున్నట్లుగా ఉత్తమ్‌ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారని, ఇప్పుడు హుజూర్‌నగర్‌ నివాసిగా అక్కడే ఉంటూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించింది. ఈ ఫిర్యాదు మేరకు ఈసీ నిర్ణయం తీసుకుంది.  హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్

భగ్గుమంటున్న కాంగ్రెస్ నేత

కాగా దీనిపై ఉత్తమ్‌ కుమార్ రెడ్డి భగ్గుమన్నారు. తన ఇంటి నుంచి తననే వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించడం ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమని మండిపడ్డారు. అధికార పార్టీకి హుజూర్‌నగర్‌ రిటర్నింగ్‌ అధికారి చంద్రయ్య, కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఎంపీగా, ఎమ్మెల్యే అభ్యర్థి భర్తగా తాను పదేళ్లుగా ఇదే ఇంట్లో ఉంటున్నానని తెలిపారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులు తనను ఆదేశించడం.. అధికార పార్టీకి కొమ్ముకాయడం కాదా? అని ప్రశ్నించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు. డబ్బు, మద్యం పంపిణీ చేసి ఉప ఎన్నికలో గెలవాలని టీఆర్‌ఎస్‌ యత్నిస్తోందని, ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు.

కోడ్‌ ఉల్లంఘించినందుకు కేసు

ఇదిలా ఉంటే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు ఉత్తమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారంటూ ఎంసీసీ టీం అధికారి పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనీల్‌రెడ్డి తెలిపారు.