Assembly Elections 2019: Polling Today all you need to know about seats, candidates, timing (Photo-Twitter)

Mumbai, October 21: గత కొద్ది రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న అసెంబ్లీ ఎన్నికల సమరంలో చివరి అంకం ప్రారంభం అయింది.  ఓటర్లు తమ తీర్పును ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కాగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అయింది. మహారాష్ట్రలోని 288, హర్యానాలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు పలు రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ప్రారంభం అయింది . అలాగే రెండు లోక్ సభ సీట్లకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 24న ఓట్లు లెక్కించి ఆ రోజు సాయంత్రానికి ఫలితాలు ప్రకటించనున్నారు.

కాగా ఎన్నికల సమరం మొదలైనప్పటి నుంచి అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి. ప్రత్యర్థుల మీద విమర్శలను గుప్పించాయి. మరి ఓటరు నాడి ఎటు ఉంటుందనేది 24 తర్వాతనే వెల్లడవుతుంది.

మహారాష్ట్ర ఎన్నికల సమరం

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 3,237 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరిలో 235 మంది మహిళలున్నారు. 8 కోట్ల 95 లక్షల 62 వేల 706 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 90 వేల 403 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ బీజేపీ-శివసేన, కాంగ్రెస్‌-ఎన్సీపీల కూటముల మధ్య ప్రధాన పోటీ జరుగనుంది. బీజేపీ 164 స్థానాల్లో పోటీ చేస్తుండగా, శివసేన 124సీట్లలో అభ్యర్థులను పోటీకి పెట్టింది. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి 147, ఎన్సీపీ నుంచి 121మంది బరిలోకి దిగారు. మరో పార్టీ రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్‌ఎస్‌ కూడా101 స్థానాల్లో పోటీ పడుతున్నది. మిగతా పార్టీలైన మజ్లిస్‌ 51, సీపీఐ 16, సీపీఎం 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. మాయావతి ఆధ్వర్యంలోని బీఎస్పీ 262 స్థానాల్లో అభ్యర్థులను దింపింది. ఇండిపెండెంట్లు 1400 మంది రంగంలో ఉన్నారు. ఇక్కడ 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 122 సీట్లను గెలుచుకోగా, శివసేన 63, కాంగ్రెస్‌ 42, ఎన్సీపీ 41 స్థానాల్లో గెలుపొందాయి.

హర్యానా ఎన్నికల సమరం

మరోవైపు హర్యానా వార్‌ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌ మధ్యనే జరగనుంది. మొత్తం 90 స్థానాలకు నిర్వహించనున్న ఈ ఎన్నికల్లో నేషనల్‌ లోక్‌దళ్‌, జననాయక్ జనతాపార్టీ, బీఎస్పీ కూడా పోటీ ఇస్తున్నాయి. మొత్తం 1,169 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 105 మంది మహిళలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19 వేల 425 పోలింగ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేశారు. కోటీ 82 లక్షల 98 వేల 714 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుత అసెంబ్లీలో 48 మంది సభ్యులున్న బీజేపీ ఈ ఎన్నికల్లో కనీసం 75 స్థానాలకు దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. గత అసెంబ్లీలో బీజేపీకి 48, ఐఎన్‌ఎల్‌డీ 19, కాంగ్రెస్‌కు 17 సీట్లు వచ్చాయి.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక సమరం

తెలంగాణా రాష్ట్రంలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా పోలింగ్ జరుగుతోంది. హుజూర్‌నగర్‌ నియోజకవర్గవ్యాప్తంగా 2,36,646 మంది ఓటర్లు ఉండగా 302 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాట్లుచేశారు. ఇందులో 79 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్‌ కోసం 2,300 మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్ ఉప ఎన్నికల సమరం

రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 30 నెలల పాలన పూర్తిచేసుకున్న యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుకు ఈ ఎన్నికలు పెద్ద పరీక్షగా నిలువనున్నాయి. ఇక్కడ బీజేపీ, సమాజ్‌వాదీపార్టీ, బహుజన సమాజ్‌పార్టీ, కాంగ్రెస్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఉపఎన్నికలు జరుగుతున్న 11 స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీనే 8 స్థానాల్లో గెలుపొందింది. కాగా ఇక్కడ శాంతి భద్రతలు, ఆర్టికల్‌ 370 రద్దు ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాలు

పంజాబ్‌-4, హిమాచల్‌ప్రదేశ్‌-2, యూపీ- 11, సిక్కిం- 3, గుజరాత్‌ -6, రాజస్థాన్‌-2, మధ్యప్రదేశ్‌-1, చత్తీస్‌గఢ్‌-1, అరుణాచల్‌ప్రదేశ్‌-1, అసోం-4, మేఘాలయ-1, బీహార్‌- 5+1(లోక్‌సభ),ఒడిశా-1, తెలంగాణ-1,పుదుచ్చేరి-1,తమిళనాడు-2,కేరళ-5,మహారాష్ట్ర-1 (లోక్‌సభ). బీహార్ లోని సమష్టిపూర్, మహారాష్ట్రలోని సతారాకు లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఓట్ల లెక్కింపు

ఈ నెల 24న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కం నెలకొంది.