TSRTC Strike : సమ్మెపై కొనసాగుతున్న సస్పెన్స్, చర్చలపై ప్రభుత్వం నుంచి ఇంకా రాని ప్రతిపాదన, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ, హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్
Tsrtc-strike-continues-as-govt-fails-to-hold-talks (Photo-PTI)

Hyderabad,October 20: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం సహా మొత్తం 26 డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెపై సస్పెన్స్ కొనసాగుతోంది. చర్చలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్‌ కార్యాచరణపై ఫోకస్‌ చేసింది.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇప్పటివరకూ సమ్మె ఎలా జరిగింది? ఇకపై ఎలా జరగాలన్నదానిపై చర్చలు జరిపారు. కొత్త కార్యాచరణతో ముందుకు వెళ్లడానికి సిద్ధమైపోయారు.

కాగా ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. అయితే ప్రభుత్వం నుంచీ అలాంటి సంకేతాలేవీ కనిపించడం లేదు. ఆర్టీసీ జేఏసీతో చర్చలపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు. బంద్ సందర్భంగా జరిగిన అరెస్టులు, రాసిన కేసుల్ని బట్టి చూస్తే ప్రభుత్వం కఠినంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభుత్వం ఇప్పుడు ప్రధానంగా తన దృష్టంతా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక మీదనే ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాతనే కార్మీక సంఘాలతో చర్చలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

16వ రోజుకు చేరిన సమ్మె

ఇదిలా ఉంటే ఆర్టీసీ సమ్మె 16వ రోజుకు చేరింది. తమ సమ్మెకు మద్దతు కూడగట్టుకోవడంలో భాగంగా ఇవాళ అన్ని కూడళ్ల దగ్గర కార్మికులు ప్రజలకు పుష్పాలను అందించనున్నారు. అలాగే ఈనెల 23న ఓయూలోని విద్యార్థులతో జేఏసీ నేతలు సమావేశం కావాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఆ తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు.

మరో డ్రైవర్ గుండెపోటుతో మృతి

మొన్న ఆర్టీసీ డ్రైవర్ మరణించిన ఘటన నుంచి తేరుకోకముందే తాజాగా ఖాజామియా అనే ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మరణించారు. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఖాజామియా ఆవేదనకు గురయ్యాడని, ప్రభుత్వ వైఖరి వల్లే ఖాజామియా చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న 55 ఏళ్ల ఖాజామియా గత 15 రోజులుగా సమ్మెలో పాల్గొన్నారు. సహచర కార్మికుడు మృతి చెందడం పట్ల తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ కార్మిక సంఘాలు విచారం వ్యక్తం చేశాయి.

భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ

ఇదిలా ఉంటే సమ్మె యథాతథంగా కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. తమ భవిష్యత్ కార్యాచరణను ఆయన వివరించారు. రేపు అన్ని డిపోల ముందు కుటుంబ సభ్యులతో ఆర్టీసీ కార్మికులు బైఠాయిస్తారని చెప్పారు. ఈ నెల 23న ప్రజా ప్రతినిధులతో భేటీ, 24న మహిళా కండక్టర్ల ర్యాలీ, ఈ నెల 30న సకల జనుల సమరభేరి పేరుతో బహిరంగ సభ వంటి వాటిని అమలుచేయనున్నారు. ఈ సందర్భంగా విలేకరులో మాట్లాడుతూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు ఆర్టీసీ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని ఆయన కోరారు. తమ పొట్ట కొట్టొద్దని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను కోరుతున్నామని చెప్పారు. ఓయూ విద్యార్థులు చేస్తున్న పోరాటాలకు ఆర్టీసీ జేఏసీ మద్దతు ఉంటుందని తెలిపారు.