B.1.1.529: మళ్లీ షట్‌డౌన్ తప్పదా.. దడపుట్టిస్తున్న B.1.1.529 వేరియంట్, భారీ స్థాయిలో మ్యూటేషన్లతో.. మనిషి రోగ నిరోధకతను నాశనం చేస్తూ.. బలం పుంజుకుంటున్న దక్షిణాఫ్రికా కరోనా వేరియంట్
బొత్సువానాలోనూ ఈ కోవిడ్ వేరియంట్ వైరస్ ఆనవాళ్లు ఉన్నాయి.
కరోనా నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. వరుస లాక్ డౌన్లు, కర్ఫ్యూలతో అన్ని దేశాలు అల్లాడిపోయాయి. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా పుట్టుకు వచ్చిన వేరియంట్లతో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్న ఈ సమయంలో మళ్లీ పిడుగులాంటి వార్త బయటకు వచ్చింది. దక్షిణాఫ్రికాలో (South Africa) పుట్టిన కొత్త కరోనా వేరియంట్ B.1.1.529 (New COVID Variant) ప్రపంచ దేశాలను మళ్లీ హడలెత్తిస్తోంది.
ఈ కరోనా వేరియంట్ లో (B.1.1.529, Coronavirus) అత్యధిక స్థాయిలో మ్యుటేషన్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.ఈ మ్యుటేషన్ల వల్ల ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. బొత్సువానాలోనూ ఈ కోవిడ్ వేరియంట్ వైరస్ ఆనవాళ్లు ఉన్నాయి. స్పైక్ ప్రోటీన్‌లో మ్యుటేషన్లు ఎక్కువగా జరిగితే.. దాని వల్ల సంభవించే నష్టం కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైరస్ ఎంత పరివర్తన చెందితే అప్పుడు రక్షణ కూడా అంత ప్రమాదకరంగా మారుతుంది.
వ్యాక్సిన్లకు కూడా లొంగకుండా వేరియంట్లు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇమ్యూనిటీని నాశనం చేసే వేరియంట్లు ఏర్పడితే ప్పుడు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు B.1.1.529 వేరియంట్‌కు చెందిన 22 కేసులను ద్రవీకరించారు. ముందుగా అంచనా వేసిన దాన్ని కన్నా ఎక్కువ వేగంగా B.1.1.529 వేరియంట్ వ్యాప్తి చెందినట్లు సౌతాఫ్రికా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు కరోనావైరస్‌కు చెందిన సార్స్ సీవోవీ 2 .. 50 కన్నా ఎక్కువసార్లు మ్యుటేట్ అయ్యింది. ఈ వైరస్‌పై ఉండే స్పైక్ ప్రోటీన్ కూడా 30 సార్లు మారినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ కన్నా కూడా.. ఇప్పుడు కొత్తగా వచ్చిన B.1.1.529 వేరియంట్‌లో ఎక్కువ మ్యుటేషన్లు జరిగినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో కనుగొన్న కరోనా వైరస్ కొత్త రకంలో.. ఏ రకంలోనూ లేని విధంగా భారీగా ఉత్పరివర్తనాలు జరిగినట్టు వారు ఆందోళన చెందుతున్నారు. కొత్త వేరియంట్ వివరాలను లండన్ ఇంపీరియల్ కళాశాల వైరాలజిస్ట్ డాక్టర్ టామ్ పీకాక్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఇది ఆందోళనకరమైన వేరియంటేనని తెలిపారు. ఇది భారీగా వ్యాపించడానికి, ప్రజల రోగ నిరోధకతను తప్పించుకొనేందుకు వైరస్‌కు బలాన్నిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు
ఈ వైరస్ విజృంభణతో దక్షిణాఫ్రికా అలర్ట్ అయింది. అర్హులంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలని, గాలి వెలుతురు ధారాళంగా ఉన్న ప్రదేశాల్లోనే సమావేశం కావాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఇక కొత్త వేరియంట్‌పై లండన్‌లో కూడా పరిశోధనలుజరుగుతున్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ శాస్త్రవేత్తలు ఈ కొత్త వేరియంట్‌పై పరిశోధనలు చేస్తున్నారు.
ఇంతకు ముందు నవంబర్ 19న శ్రీలంకలో కరోనా డెల్టా వేరియంట్ కొత్త వేరియంట్‌ను గుర్తించారు. దానికి B.1.617.1.AY104గా పేరుపెట్టారు. ఇది శ్రీలంకలో గుర్తించిన మూడో మ్యుటేషన్. కరోనా డెల్టా వేరియంట్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ ఏడాది ప్రారంభంలో, మధ్యలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదయ్యేందుకు డెల్టా వేరియంటే కారణమని నిపుణులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో బోట్స్వానా, హాంకాంగ్ దేశాల్లోనూ గుర్తించారు. సౌత్ ఆఫ్రికా ఆరోగ్యమంత్రి జో ఫాహ్లా వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆఫ్రికా దేశంలో 1200కుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. అమెరికాలో కరోనా మళ్లీ పంజా విసురుతున్నది. 15 రాష్ట్రాల్లోని ఐసీయూల్లో కరోనా రోగులే అధికంగా ఉన్నారు. వీరి సంఖ్య గత ఏడాది కంటే ఎక్కువ ఉంది. ముఖ్యంగా కొలరాడో, మిన్నెసొటా, మిషిగాన్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది. కరోనా రోగుల తాకిడితో దవాఖానలపై ఒత్తిడి పెరుగుతున్నది. ఇతర ప్రాణాంతక వ్యా ధులతో బాధపడుతున్నవారికి వైద్య సేవలు అందించలేక పోతున్నామని వైద్య వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లు విస్తృతంగా లభ్యమవుతున్నప్పటికీ కరోనా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో మూడు నెలలుగా రోజూ సగటున వెయ్యి కరోనా మరణాలు నమోదవుతున్నాయి.
బి.1.1.529 వేరియంట్ ఎలా ఉత్పన్నమైందన్న దానిపై ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. అయిత రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగిలో ఈ వేరియంట్ ఉత్పన్నమై ఉంటుందని లండన్ లోని యూసీఎల్ జెనెటిక్స్ ఇనిస్టిట్యూట్ కు చెందిన శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో 8.2 మిలియన్లకు పైగా హైచ్ఐవీ బాధితులున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ఎయిడ్స్ రోగులున్న దేశం కూడా ఇదే.. గతంలో అదే దేశంలో బయటపడ్డ బీటా వేరియంట్ కూడా హెచ్ ఐవీ సోకిన వ్యక్తి నుంచే ఉత్పన్నమైనట్లు ఆ మధ్య నిపుణులు తెలిపారు. దీంతో తాజా వేరియంట్ కూడా వారి నుంచే వచ్చి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఉన్న వేరియంట్ల కంటే బి.1.1.529 వేరియంట్ చాలా భిన్నమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిలో 50 మ్యూటేషన్లు ఉండగా ఒక్క స్పైక్ ప్రొటీన్ లోనే 30కి పైగా ఉత్పరివర్తనాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. డెలా్ట వేరియంట్ కంటే ప్రమాదకర మ్యూటేషన్లు ఈ కొత్త వేరియంట్ లో ఉన్నాయని వారు చెబుతున్నారు. కాగా మనిషి శరీరంలోకి వైరస్ ప్రవేశించడంలో ఈ స్పైక ప్రొటీనే కీలకగా పనిచేస్తుంది. బి.1.1.529 రకంలోని అధిక మ్యూటేషన్లు కోవిడ్ వైరస్ ప్రవర్తనపై ప్రభావం చూపనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీని ప్రభావం అర్థం చేసుకోవాలంటే వారాలే పడుతుందని తెలిపింది.