South Africa Beat England by Seven Wickets in ICC Champions Trophy 2025

Karachi, March 01: ఛాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy)లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ (SA vs ENG)లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ కేవలం 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 29.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డస్సెన్‌ 72* (87), క్లాసెన్‌ 64 (56) అర్ధ సెంచరీలు చేశారు. రికెల్టన్‌ 27 (25), మిల్లర్‌ 7*(2) పరుగులు చేయగా.. స్టబ్స్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. జోఫ్రా ఆర్చర్‌ రెండు వికెట్లు, రషీద్‌ ఒక వికెట్‌ తీశారు. తాజా విజయంతో దక్షిణాఫ్రికా సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకోగా.. ఇప్పటికే సెమీస్‌ నుంచి వైదొలిగిన ఇంగ్లాండ్‌ తన చివరి లీగ్‌ మ్యాచ్‌నూ ఓటమితో ముగించింది.

South Africa Beat England in ICC Champions Trophy 2025

 

180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 2.1 ఓవర్‌లో తొలి వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో స్టబ్స్‌ డకౌట్‌ అయ్యాడు. ఎనిమిదో ఓవర్‌లోనూ ఆర్చర్‌ మరో వికెట్‌ (రికెల్టన్‌) తీశాడు. ఆ తర్వాత డస్సెన్‌, క్లాసెన్‌లు కలిసి జట్టును ముందుకు నడిపారు. ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్‌కు 127 పరుగులు జోడించారు. గెలుపు ముంగిట రషీద్‌ బౌలింగ్‌లో క్లాసెన్‌ క్యాచ్‌ ఔట్‌ అయినప్పటికీ.. సిక్స్‌తో మిల్లర్‌ మ్యాచ్‌ను ముగించాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా బౌలర్ల దెబ్బకు 130 పరుగుల్లోపే ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను కెప్టెన్ జోస్ బట్లర్ (21), జోఫ్రా ఆర్చర్ (25) కాపాడేందుకు ప్రయత్నించారు. సౌతాఫ్రికా బౌలర్లు యాన్‌సెన్ 3, ముల్డర్ 3, కేశవ్ మహరాజ్‌ 2, కగిసో రబాడ, ఎంగిడి ఒక్కో వికెట్ తీశారు.