Surat Diamond Bourse: సూరత్ లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్.. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
గుజరాత్ లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ అయిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు.
Surat, Dec 17: గుజరాత్ లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ అయిన సూరత్ డైమండ్ బోర్స్ (Surat Diamond Bourse) భవనాన్ని ప్రధాని మోదీ (PM Modi) నేడు ప్రారంభించనున్నారు. సూరత్ లోని డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీలో నిర్మించిన ఈ బిల్డింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపు రూ.3,500 కోట్ల వ్యయంతో 35.54 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మెగాస్ట్రక్చర్‌లో 9 గ్రౌండ్ టవర్లతో పాటు 15 అంతస్తులు ఉన్నాయి. 300 చదరపు అడుగుల నుంచి 1 లక్ష చదరపు అడుగుల వరకు కార్యాలయ స్థలాలు ఉన్నాయి.
పెంటగాన్ కంటే పెద్దది
67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ భవన సముదాయంలో 4,500 డైమండ్ ట్రేడింగ్ కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పటికే 130 కార్యాలయాలు వాడుకలో ఉన్నాయి. పెంటగాన్ కంటే పెద్దదని చెబుతున్న ఈ భవనానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) నుంచి ప్లాటినం ర్యాంకింగ్ ఉంది.