Hyderabad, Dec 17: బస్సు కండక్టర్ (Bus Conductor) కు ఐడీ కార్డు (ID Card) చూపిస్తూనే ఆర్టీసీ బస్సులో (RTC Bus) మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. లేదంటే టిక్కెట్టు (Ticket) చార్జీ చెల్లించాలి. ఐడీ లేకుండా, టికెట్ తీసుకోకుండా ప్రయాణించాలనుకుంటే రూ.500 జరిమానా విధించనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ శనివారం స్పష్టం చేసింది. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర మహిళలు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తెలంగాణలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం డిసెంబర్ 9న ప్రారంభం కాగా, ఆర్టీసీ శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేసి, ఐడీ కార్డును తప్పనిసరి చేసింది. తొలిరోజు వెసులుబాటు కల్పించగా, శనివారం నుంచి చర్యలు తీసుకుంటున్నారు.
ధ్రువీకరణ కోసం వీటిలో ఏదైనా ఒకటి
స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డును కండక్టర్లకు చూపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపితేనే జీరో టికెట్లు జారీ చేస్తారని పేర్కొన్నారు.