Tirumala, DEC 16: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం (Vaikunta Dwara Darshanam) కల్పించనున్నట్లు తెలిపింది. ఈ నెల 23 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు వైంకుఠ ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పింది. వైకుంఠంలో శ్రీమహావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరం అని అర్థం. అదేవిధంగా అక్కడ పగలు 12గంటలు ఇక్కడ 6 నెలలు ఉత్తరాయణం, రాత్రి 12 గంటలు ఇక్కడ ఆరు నెలలు దక్షిణాయణం. వైకుంఠంలో (Vaikunta Dwara Darshanam ) తెల్లవారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధనుర్మాసంగా పిలుస్తున్నాం.
తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీమహావిష్ణువు దేవతలకు, ఋషులకు దర్శనమిస్తారు. ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది. ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు సమానం కాబట్టి వైష్ణవాలయాల్లో పది రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీమహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది భక్తుల విశ్వాసం.
వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల్లో ఏ రోజు దర్శనం చేసుకున్నా అన్ని రోజులూ సమానమేనని టీటీడీ పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి రావాలని కోరింది. తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేసింది. గతంలో మాదిరిగానే ఈ ఏడాది స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు పరిమితంగా మాత్రమే బ్రేక్ దర్శనం ఇస్తుందన్నారు. సిఫారసు లేఖలు స్వీకరించబవని స్పష్టం చేసింది. వీఐపీలు, ఇతర భక్తులు తొలిరోజైన వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే దర్శనం చేసుకోవాలనే తొందరపాటు లేకుండా పది రోజుల్లో ఏదో ఒకరోజు దర్శనం చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది.