
Hyd, Jan 18: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ (Public interest litigation) దాఖలైంది. మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష(Free travel for women is discriminatory) కిందకే వస్తుందని నాగోల్‌కి చెందిన ప్రైవేట్ ఉద్యోగి పిటిషన్ వేశారు.
కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో ఉచిత పథకంపై అధికారం రాష్ట్రానికి లేదని.. జీవో 47 రద్దు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని నిలిపివేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాకి పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి.
రద్దీ ఎక్కువగా ఉండడంతో సీట్ల కోసం గొడవలు కూడా జరుగుతున్నాయి. పురుషులకు సీట్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. మహిళల రద్దీ కారణంగా టికెట్లు కొనుగోలు చేసి వెళ్లే పురుష ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. 1950లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రోడ్డు రవాణా చట్టం ప్రకారం ఆర్టీసీ కార్పొరేషన్ ఏర్పాటైందని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు.
మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం పురుషుల పట్ల వివక్ష చూపడమే అవుతుందని, ఇది రాజ్యాంగంలోని 15వ అధికరణానికి వ్యతిరేకమని వివరించారు. ఉచిత ప్రయాణం వల్ల ఆర్థికంగా ఆర్టీసీపై పడే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం కూడా అన్యాయమేనని, పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బును మహిళల ఉచిత ప్రయాణ వసతికి వినియోగించడం చెల్లదని పేర్కొన్నారు.
రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు ఆర్టీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖను ఈ పిల్‌లో ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం త్వరలో విచారణ జరుపనున్నది.