AP Assembly Special Session Day 1: అమరావతిని చంపేశామని ఎవరన్నారన్న సీఎం జగన్, చేతులెత్తి మొక్కుతున్నానంటూ చంద్రబాబు ఆవేదన, 3 రాజధానులపై అసెంబ్లీలో వాడి వాడీ చర్చ, ఎవరేమన్నారో వారి మాటల్లో..

కాగా మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Special Session day 1) కాక పుట్టించాయి. సభలోకి స్పీకర్ తమ్మినేని (AP Speaker) ప్రవేశించిన వెంటనే 'బ్యాడ్ మార్నింగ్ సార్' అని టీడీపీ ఎమ్మెల్యేలు(TDP MLAs) అన్నారు.

Andhra pradesh Assembly Session for Three Capitals Confirmed on 20th(photo-PTI)

Amaravathi, January 21: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు (AP Assembly Session)మూడు రోజులు, శాసనమండలి సమావేశాలు రెండు రోజులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Special Session day 1) కాక పుట్టించాయి. సభలోకి స్పీకర్ తమ్మినేని (AP Speaker) ప్రవేశించిన వెంటనే 'బ్యాడ్ మార్నింగ్ సార్' అని టీడీపీ ఎమ్మెల్యేలు(TDP MLAs) అన్నారు.

దీనికి ప్రతిస్పందనగా... ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పి, మంచి జరగాలని కోరుకుంటారని... బ్యాడ్ మార్నింగ్ చెప్పేవారి గురించి ఏం మాట్లాడగలమని స్పీకర్ చమత్కరించారు. అక్కడ మొదలు పెడితే మూడు రాజధానుల బిల్లు ( 3 Capitals Bill) ఆమోదం, చంద్రబాబు అరెస్ట్ దాకా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

చంద్రబాబు అరెస్ట్, 3 రాజధానుల బిల్లు అమోదం

సీఎం జగన్ స్పీచ్ (CM YS Jagan)

నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశం సంధర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని తొలగిస్తున్నామని విపక్షాలు చేస్తున్న ప్రచారం పూర్తి అవాస్తవమని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.అమరావతి రాజధానిగానే ఉంటుందని, మరో రెండు రాజధానులను కూడా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని సభకు తెలిపారు.

టీడీపీ తీరుపై మండిపడ్డ స్పీకర్ తమ్మినేని, రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై విచారణ జరపాలని సీఎంకు విజ్ఞప్తి

అసలు అమరావతి అనే ప్రాంతం విజయవాడలోనూ లేదని, గుంటూరులోనూ లేదని వ్యాఖ్యానించిన జగన్, గత ప్రభుత్వం చూపిన గ్రాఫిక్స్ వల్ల అమరావతి అన్న నగరం ఏర్పడిందని ప్రజలను నమ్మించారని అన్నారు. ఈ సందర్భంగా శివరామకృష్ణన్ కమిటీ సహా పలు కమిటీలు ఇచ్చిన రిపోర్టుల వీడియోలను జగన్ అసెంబ్లీలో చూపించారు. అమరావతి అంటే తనకు ఇష్టం లేదని తెలుగుదేశం చేస్తున్న ప్రచారాన్ని జగన్ తిప్పికొట్టారు. ఈ ప్రాంతమంటే తనకెంతో ఇష్టమని, అందుకే తాను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని, అంత ప్రేమ ఉన్న చంద్రబాబుకు ఇంతవరకూ సొంత ఇల్లే లేదని గుర్తు చేశారు. తనకు ఇష్టం లేకుంటే, ఇక్కడే అసెంబ్లీ సమావేశాలను ఎందుకు పెడతానని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు?

భవిష్యత్తులో విజయవాడ, గుంటూరుల మధ్య ఓ మహానగరం ఏర్పడుతుందని, అందుకు ఏం చేయాలో తనకు తెలుసునని, రాజధాని నిమిత్తం భూములిచ్చిన ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరుగబోదని, గత ప్రభుత్వం ఇస్తానన్న పరిహారం కన్నా అధిక పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి, రైతు భరోసా తదితర సంక్షేమ పథకాలతో ప్రజలు దగ్గరవుతుంటే, చంద్రబాబు తట్టుకోలేకున్నారని మండిపడ్డారు.

దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా

తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్దుతోందని, అమరావతి అంటూ చెప్పుకుంటున్న ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిన మాట వాస్తవమని, మొత్తం లావాదేవీలనూ వెలుగులోకి తీసుకు వస్తామని స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం, భవిష్యత్తులో మరో ఉద్యమం రాకుండా, పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా దృష్టిని సారించిన తమ ప్రభుత్వం, పలు కమిటీలను వేసి, వాటి నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

రాజధాని అంశంలో కీలక మలుపు

అమరావతిని చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ మాదిరిగా కట్టాలంటే, సాధారణ భవన నిర్మాణ పనులు జరిగే వేగానికి ఐదు రెట్ల వేగంగా చేస్తే, 30 నుంచి 35 ఏళ్లు పడుతుందని, ఇప్పుడు లక్ష కోట్లుగా ఉన్న అంచనా వ్యయం, అప్పటికి ఎన్నో రెట్లు పెరిగిపోతుందని జగన్ వ్యాఖ్యానించారు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టని ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు.

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు(Chandra babu)

రాజధాని అమరావతిని తరలించవద్దని, రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మంచిది కాదని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు. సీఆర్డీఏ బిల్లు రద్దుపై చర్చ సందర్భంగా ఆయన భావోద్వేగ ప్రసంగం చేశారు. నాడు తన హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ తన తర్వాత సీఎం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించారని గుర్తుచేసుకున్నారు. కనీసం తన తండ్రిని జగన్ స్ఫూర్తిగా తీసుకుని రాజధాని అమరావతిని పూర్తి చేయాలని కోరారు.

‘నాకు జగన్మోహన్ రెడ్డిపై కోపం లేదు. నా కంటే చిన్నవాడైనా రెండు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఆలోచించండి.. తొందరపడొద్దు.. ఇది మంచిది కాదు. ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానులు సక్సెస్ కాలేదు. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు’ అని అన్నారు. కడప జిల్లాకు రూ.1450 కోట్లు కేటాయించడం సంతోషమని, ఆ డబ్బుల్లో కొంతైనా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కేటాయించి ఉంటే అందుకు తాను మెచ్చుకునేవాడినని అన్నారు. బాగా వెనుకబడ్డ జిల్లాలకు నిధులు కేటాయించి, వాటి అభివృద్ధికి పాటుపడితే సత్ఫలితాలు వస్తాయని, అలా చేయకుండా రాజకీయంగా వెళితే ‘మీకు, రాష్ట్ర ప్రజలకు నష్టం’ అని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

అమరావతి కోసం 24 మంది రైతులు చనిపోయారని ప్రచారం చేస్తున్నారు. గుంటూరులో ఉన్న నాకే ఆ విషయం తెలియదు. అంతా అసత్య ప్రచారమే" అంటూ మండిపడ్డారు. టీడీపీ మాట మార్చే రోజు వస్తుందని, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మేం ఎప్పుడు వద్దన్నాం అంటూ మరో మాట చెప్పడం ఖాయమని అన్నారు. గతంలో ఇంగ్లీషు మీడియం విషయంలోనూ ఇలాగే వ్యవహరించి, ఆ తర్వాత మేమెప్పుడు వద్దన్నామంటూ టీడీపీ నేతలు మాట మార్చారని ఆరోపించారు. 'మాది తుగ్లక్ ప్రభుత్వం అంటున్నారు, ఉమ్మడి రాజధాని వదిలేసి వచ్చిన మీదే తుగ్లక్ పాలన అంటూ విమర్శించారు.

మంత్రి కొడాలి నాని

తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో లేదని అప్పటి ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణరావు చెబితే నాడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్ మళ్లీ పోటీ చేసి గెలిచారని, ఆ సెంటిమెంట్ ఉందని నిరూపించారని గుర్తుచేశారు. జగన్మోహన్ రెడ్డికి రాజీనామాలు చేయడమేమీ కొత్త కాదని, వైసీపీ స్థాపించినప్పుడు ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని ప్రజలు భావిస్తున్నారన్న నమ్మకం టీడీపీ ఎమ్మెల్యేలకు కనుక ఉంటే, ఆ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామాలు చేసి, తిరిగి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. నాడు కేసీఆర్, జగన్ తమ పదవులకు రాజీనామా చేసినట్టుగా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని అన్నారు.

జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్

అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలోనిన్న ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి అంతా ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందో రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలిసిందని, అందుకే, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీ చేసే ప్రతిదానిని వ్యతిరేకించడం కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై ప్రజాభిప్రాయం సేకరించాలని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాపాక ప్రస్తావించారు. రామానాయుడు చెప్పినట్టుగా ప్రజాభిప్రాయం సేకరిస్తే అసలు విషయం తెలుస్తుందని, మూడు రాజధానులకు ఎవరూ వ్యతిరేకంగా లేరని, అందరూ అనుకూలంగానే ఉన్నారని అభిప్రాయపడ్డారు. ప్రజల అభిప్రాయమే తమ అభిప్రాయమని, యావత్తు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంలో ప్రజలు ఉన్నారని చెప్పారు. మూడు రాజధానులు వద్దని ప్రతిపక్షంలో ఉన్న రామానాయుడు మాట్లాడాలి కనుక మాట్లాడుతున్నారే తప్ప, నిజంగా అయితే ఆయనకు కూడా ఇష్టమేనని వ్యాఖ్యానించారు. సీఆర్డీఏ బిల్లు రద్దుకు జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నానని, యువ ముఖ్యమంత్రి జగన్ ని అభినందిస్తున్నానని అన్నారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిరూపించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో వైసీపీ నేతలు విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. అమరావతిలో, విశాఖలో ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచారణకు తాము సహకరిస్తామని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీఎం జగన్ కు సూచించారు. రాజధాని అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, దీని నిర్మాణానికి ఖజానా నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లొచ్చని అన్నారు. అమరావతిపై వైసీపీ ప్రభుత్వం ఎన్నోఅసత్యాలు ప్రచారం చేసిందని ఆరోపించారు.

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

వికేంద్రీకరణే ఈ రాష్ట్రానికి శరణ్యమని, రాష్ట్ర ప్రజలందరూ ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారని, ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారని వివరించారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీల కంటే ముందే శివరామకృష్ణన్ కమిటీ వికేంద్రీకరణ జరగాలని సూచించిందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కారణంగానే రాష్ట్ర ప్రజలు ఇవాళ రాజధాని లేకుండా మిగిలిపోయారని ఆరోపించారు. ప్రాంతాల మధ్య అడ్డుగోడలు కట్టడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు మధ్య అపోహలు పెంచే విధంగా వ్యవహరించవద్దని చంద్రబాబుకు హితవు పలికారు.

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

సీఆర్డీఏ రద్దు బిల్లును, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ప్రజలకు చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారని, రైతుల ఆశలను ఆయన నీరు గార్చారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో తన స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని విమర్శించారు. నాడు రైతులపై బలవంతంగా భూ సమీకరణ చట్టాన్ని రుద్దారని, శివరామకృష్ణన్ కమిటీని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందని సీఎం ప్రకటించడం తమ అదృష్టమని, అమరావతికి దక్కిన గౌరవమని అన్నారు. సెక్రటేరియట్ తో సామాన్యులకు పని ఉండదని చెప్పారు. రాజధాని అంటే అందరిదీ అని, కొందరిది మాత్రమే కాకూడదని అన్నారు.