Amaravati, January 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని 'వికేంద్రీకరణ' (Decentralization) ప్రధాన అంజెండాగా , ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర కేబినేట్ ఇప్పటికే ఆమోదించిన పాలన వికేంద్రీకరణ, సమగ్ర అభివృద్ధి బిల్లులను చట్ట సభల్లో ఆమోదించుకోనుంది.
అయితే 151 మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని మెజారిటీ గల జగన్ ప్రభుత్వానికి అసెంబ్లీలో ఆ బిల్లులను ఆమోదించుకోవడం అత్యంత తేలికైన పని. ఎటొచ్చి శాసన మండలి (Legislative Council) లో ప్రభుత్వానికి మెజారిటీ లేదు.
58 మంది సభ్యులుండే శాసనమండలిలో 29 మంది ఎమ్మెల్సీలతో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉంది, అయితే ఎగువ సభలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 9 మంది సభ్యుల సంఖ్యా బలం మాత్రమే కలిగి ఉంది. ఇప్పటికిప్పుడు మండలిలో ప్రభుత్వానికి మెజారిటీ లభించే అవకాశం కూడా లేదు. అంతేకాకుండా, మండలి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులు సైతం టీడీపీ నుంచి ఎన్నికైన వారే ఉన్నారు. అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులు శాసనమండలికి వచ్చినపుడు మండలి చైర్మన్ వాటిని ఏకపక్షంగా తిరస్కరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'రాజధాని వికేంద్రీకరణ' బిల్లు శాసన మండలిలో తిరస్కరణ కాకుండా ఉండేందుకు, ఏకంగా శాసన మండలినే రద్దు చేసే వ్యూహం పన్నినట్లు సమాచారం. శాసన మండలి రద్దు చేయడం ద్వారా, కేవలం అసెంబ్లీలో ఆమోదం ద్వారానే రాజధాని బిల్లు అధికారికంగా చట్ట రూపం దాలుస్తుంది.
టీడీపి మెజారిటీ ఉన్న రాష్ట్ర శాసనమండలిని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan) నిర్ణయించినట్లు సమాచారం. శాసనమండలిని రద్దు చేయడానికి రాష్ట్ర న్యాయ శాఖ ఇప్పటికే ముసాయిదా బిల్లును తయారు చేసి సీఎం వద్దకు పంపించినట్లు తెలుస్తుంది. ఈ బిల్లును కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి శాసనమండలిని రద్దు చేసే తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నట్లు పలు నివేదికల ద్వారా వెల్లడవుతోంది.
గతంలో 1985లో ఎన్ టి రామారావు (NTR) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సభ్యులున్న శాసన మండలిని ఆనాటి టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. 2007లో సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపి శాసనమండలిని తిరిగి పునరుద్ధరించారు. అయితే మళ్లీ ఇప్పుడు ఆయన కొడుకు సీఎం జగన్ గతంలో టీడీపీ చేసిన శాసన మండలి రద్దును నేడు వారిపైనే ప్రయోగించబోతున్నట్లు సమాచారం.