Andhra Pradesh Covid: కరోనా కల్లోలం..ఏపీ సర్కారు కీలక నిర్ణయం, 40 పడకల ఆస్పత్రులను కోవిడ్ హాస్పిటల్స్‌గా మార్చేందుకు ఏర్పాట్లు, 104 కాల్ సెంటర్ సమర్ధవంతంగా పనిచేసేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు
40 పడకల ఆస్పత్రులను కోవిడ్ హాస్పిటల్స్‌గా (Covid Hospitals) మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.
Amaravati, April 27: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వైద్య సేవల కోసం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 40 పడకల ఆస్పత్రులను కోవిడ్ హాస్పిటల్స్‌గా (Covid Hospitals) మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. నియోజకవర్గ కేంద్రాల్లో కాలేజీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రోజుకు 12వేల రెమిడెసివర్ ఇంజక్షన్లు రప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. రేపు(బుధవారం) మధ్యాహ్నం మంత్రి ఆళ్ల నాని (Minister Alla Nani) అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. కాగా, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) మంగళవారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, నివారణకు ఆది నుంచి పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఈ ప్రక్రియలో మరో ముందడుగు వేసింది.
కోవిడ్ ఆస్పత్రులు (ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వం టేకోవర్ చేసిన ప్రై వేట్ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు) వద్ద మంచి వైద్యం, ఆక్సిజన్, ఆహారం, మందులు, నీరు, పారిశుద్ధ్యం లాంటివి సక్రమంగా ఉన్నాయా? లేవా? అన్నవి చూడడం, కోవిడ్ రోగులకు పడకల కేటాయింపు, 104 కాల్‌సెంటర్ ద్వారా ఆశిస్తున్న సేవలు అందుతున్నాయా? లేదో పర్యవేక్షించడం, ఎక్కడా లోపాలు లేకుండా చేసేందుకు తాజాగా మూడంచెల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది.
దీంతో పాటుగా 104 కాల్ సెంటర్ సమర్ధవంతంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆయన స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తూ.. 104కు ఫోన్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. కోవిడ్ సమస్యలకు 104 నంబర్ వన్‌స్టాప్‌గా ఉండాలని పేర్కొన్నారు.
104కు ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలి. 104 కాల్ సెంటర్‌కు వైద్యులు అందుబాటులో ఉండాలి. జాయింట్ కలెక్టర్లు ఇక నుంచి కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. జిల్లా స్థాయిలో కోవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించాలి. జిల్లా స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలి. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది పూర్తిస్థాయిలో ఉండాలి. ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించాలని’’ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.