Amaravati, April 26: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా వైద్యరంగంలో నియామకాలు చేపట్టింది. కోవిడ్ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 1,170 స్పెషలిస్టులు , 1,170 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, 2వేల మంది స్టాఫ్ నర్సులు, 300 మంది అనస్థీషియా టెక్నీషియన్ల నియామకానికి ఉత్తర్వులు ఇచ్చింది.అలాగే 300 మంది ఎఫ్.ఎన్.ఓలు, 300 మంది ఎమ్.ఎన్.ఓలు, 300 మంది స్వీపర్ల నియామకానికి ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉద్యోగాలన్నీ ఆరు నెలల కాలపరిమితికి గానూ కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా 33 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయని స్పెషల్ ఆఫీసర్ కృష్ణబాబు పేర్కొన్నారు. మైల్డ్ సింటమ్స్ ఉన్న వారిని మాత్రమే కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలిస్తున్నామన్నారు. 5 శాతం మందికి మాత్రమే ఆస్పత్రి అవసరం ఉంటుందని పేర్కొన్నారు. 15 వేల మంది ఆస్పత్రుల్లో, 5 వేల మంది కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు. ఫుడ్, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని కృష్ణబాబు తెలిపారు.
ఆక్సిజన్ వృథా కాకుండా మెడికల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. సోమవారం ఆయన కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వాస్పత్రుల్లో రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రెమిడెసివర్ కొరత లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
40 బెడ్స్ ఉన్న ఆస్పత్రులను కోవిడ్ సెంటర్లుగా అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. ప్రైమరీ కాంటాక్ట్ అందరికీ పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. కోవిడ్ టెస్టుల ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. 104కు కాల్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.