Election Commission of India. File Image. (Photo Credits: PTI)

New Delhi, April 27: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మే 2న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పుడు గానీ... వచ్చిన తర్వాత గానీ... రాజకీయ పార్టీలు సంబరాలు చేయడానికి వీల్లేదని (EC Bans Victory Processions) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతం సహా తమిళనాడు, కేరళ, అసోంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పూర్తికాగా.. పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్నాయి. అలాగే పలు రాష్ట్రాల్లోనూ పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మే 2న తేదీన ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై (Election Commission bans victory processions) ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

ఇప్పటికే ఎన్నికల్లో కొవిడ్‌ నిబంధనల అమలు విషయంలో మద్రాస్‌ హైకోర్టు ఎన్నికల కమిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ కేసులు కొనసాగుతున్నప్పటికీ ర్యాలీలు, రోడ్‌షోల్లో ఆంక్షల అమలులో పూర్తిగా విఫలమైందని, ‘కరోనా సెకండ్‌ వేవ్‌కు ఏకైక కారణం ఈసీ అని, ఇందుకు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని’ న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కనీసం కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించేలా ఎన్నికల సంఘం సరైన ప్రణాళికలు అమలు చేయకపోతే మే 2వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపివేస్తామని హెచ్చరించింది.ఈ మేరకు ఓట్ల లెక్కింపునకు ముందు కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ ఎలా అమలు చేస్తారో బ్లూప్రింట్‌ సిద్ధం చేయాలని ఆదేశించింది.

కరోనా వ్యాప్తికి ఈసీదే బాధ్యత, సంచలన వ్యాఖ్యలు చేసిన మద్రాస్ హైకోర్టు, క‌రోనా క‌ట్ట‌డికి స‌రైన ప్ర‌ణాళిక లేకుంటే మే 2న విడుద‌ల‌య్యే ఫ‌లితాల‌ను నిలిపివేస్తామ‌ని హెచ్చరిక

ఈ క్రమంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు సంబంధిత రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం పొందేందుకు విజేతతో పాటు మరో ఇద్దరికి అవకాశం కల్పించింది. సరైన చర్యలు తీసుకోవట్లేదు అని హైకోర్టు భావిస్తే... కౌంటింగ్ జరగకుండా ఆపేస్తామని హెచ్చరించింది. కాగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల వల్లే దేశంలో కరోనా బాగా పెరిగిపోయిందనే వాదన ఉంది. ఈ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు... వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని... పెద్ద ఎత్తున ర్యాలీలు, ప్రచార సభలు నిర్వహించాయి. దాంతో... ఎక్కడా కరోనా రూల్స్ అమల్లో లేకుండా పోయాయి. మాస్కులు లేవు, సోషల్ డిస్టాన్స్ లేదు, శానిటైజర్లూ వాడలేదు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుంపులుగా రావడం వల్ల... ఇప్పడు దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ చంపేస్తోంది.