Chennai, April 26: భారత ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో రెండో దశ కోవిడ్ వ్యాప్తికి (COVID-19 Surge in India) ఈసీదే బాధ్యతని పేర్కొంది. ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలి. విధులను సక్రమంగా నిర్వహించడంలో వైఫల్యం చెందడంపై ప్రాసిక్యూట్ చేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా వేళ ఎన్నికల ర్యాలీలను ఈసీ (Election Commission) నిరోధించలేకపోయిందని, రాజకీయ పార్టీలు కోవిడ్ నిబంధనలు, ప్రోటాకాల్స్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా మిన్నకుండిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఓట్ల లెక్కింపు రోజైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు (Madras High Court) సూచించిది. కరోనా విపత్తు ముంచుకొస్తున్న సమయంలో రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది. ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు వేరే గ్రహంలో ఉన్నారా’? అని ఈసీఐ కౌన్సిల్‌ను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ వ్యాఖ్యానించారు.
ఇందుకు సంబంధించిన ప్రణాళిక సమర్పించాలని ఆదేశించింది. 30వ తేదీలోగా ఓట్ల లెక్కింపు ప్రణాళిక ఇవ్వకుంటే తమిళనాడులో ఓట్ల లెక్కింపు ఆపేస్తామని హెచ్చరించింది. ఈనెల 6న ఒకే విడతలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. కరోనా కట్టడికి సరైన ప్రణాళిక లేకుంటే మే 2న విడుదలయ్యే ఫలితాలను నిలిపివేస్తామని హెచ్చరించింది.
కాగా తమిళనాడులో గడిచిన 24 గంటల్లో 15,659 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,81,988కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 4206 ఒక్క చెన్నై నగరంలోనే వెలుగు చూశాయి. కరోనా మరణాలు కూడా తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. ఆదివారం రోజు కరోనా సోకి 82 మంది మరణించారు.