Dewas, JAN 11: సాధారణంగా హత్య (Murder) జరిగితే వెంటనే విషయం బయటికి వస్తుంది. అరుదుగా కొన్ని కేసుల్లో హత్య విషయం వెలుగులోకి రావడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. కానీ ఓ హత్య విషయం బయటికి రావడానికి మాత్రం ఏకంగా 10 నెలల సమయం పట్టింది. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని దెవాస్ జిల్లా (Devas district) లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెతో ఐదేళ్లపాటు సహజీవనం చేసిన వ్యక్తే ఆమెను హత్యచేశాడు. ఆపై మృతదేహాన్ని ఫ్రిజ్‌లో కుక్కి పారిపోయాడు. 10 నెలల క్రితం జరిగిన ఈ హత్య విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. దెవాస్ జిల్లా BNP (బ్యాంక్‌నోట్ ప్రెస్) పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీలో ధీరేంద్ర శ్రీవాస్తవ్ అనే వ్యక్తికి ఒక ఇల్లు ఉంది. అతను ఆ ఇంటిని అద్దెకు ఇచ్చి ఇండోర్‌లోని మరో ఇంట్లో ఉంటున్నాడు. చాలా కాలంగా ఆ ఇంట్లో అద్దెకు ఉన్న సంజయ్ పటిధార్ అనే వ్యక్తి కొన్ని నెలలుగా కనిపించడం లేదు. ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయాడు. దాంతో ఇటీవల ధీరేంద్ర ఆ ఇంటిని బల్‌బీర్ రాజ్‌పుత్ అనే మరో వ్యక్తికి అద్దెకిచ్చాడు.
ఈ నెల 8న మారు తాళంతో తలుపుతీసి బల్‌బీర్‌కు ఇంటిని చూపించి మళ్లీ తాళం వేసుకున్నాడు. శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకునేందుకు బల్‌బీర్ రాజ్‌పుత్ రావడంతో ధీరేంద్ర అతడికి తాళాలు ఇచ్చాడు. ఇంటిని శుభ్రం చేస్తూ ఫ్రిజ్ డోర్ తెరిచిన బల్‌బీర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఎందుకంటే ఆ ఫ్రిజ్‌లోంచి ఓ మహిళ మృతదేహం బయటపడింది. దాంతో వెంటనే ఇంటి ఓనర్ ధీరేంద్రకు సమాచారం ఇచ్చాడు.
Decomposed Body of Woman Found in Fridge in Dewas
Dewas, Madhya Pradesh: A woman's dead body was found in a house in Vrindavan Dham Colony. The body was found inside a fridge in a locked room. Police are investigating the matter pic.twitter.com/JO2z4NKN9D
— IANS (@ians_india) January 10, 2025
ధీరేంద్ర ఫిర్యాదు మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బల్‌బీర్ కంటే ముందు ఆ ఇంట్లో అద్దెకున్న సంజయ్ పటిధార్‌ను దొరకబట్టుకుని విచారించడంతో నేరం అంగీకరించాడు. తనతో సహజీవనం చేసిన ప్రతిభ అలియాస్ పింకీని తానే హత్య చేశానని చెప్పాడు. ఇంట్లోంచి దుర్వాసన రాకుండా ఫ్రిజ్ ఆన్ చేసి మృతదేహాన్ని ఫ్రిజల్‌లో పెట్టానని, ఆ తర్వాత ఇంటికి తాళం వేసి వెళ్లిపోయానని తెలిపాడు.
అయితే చాలాకాలంగా సంజయ్ ఇంటికి తాళం వేసి ఉంచడం, ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ధీరేంద్ర ఈ నెల 8న మారు తాళంచెవితో తాళం తీసి బల్‌బీర్‌కు ఇల్లును చూపించాడు. బల్‌బీర్ ఈ నెల 10న వస్తానని చెప్పడంతో ఇంట్లో కరెంట్ ఆఫ్ చేసి తాళం వేశాడు. దాంతో కూలింగ్ తగ్గిపోయి మృతదేహం కుళ్లింది. ఇంట్లో అడుగుపెట్టగానే దుర్వాసన వస్తుండటంతో బలబీర్ ఫ్రిజ్ డోర్ తీసి చూశాడు. దాంతో పింకీ మృతదేహం బయటపడింది.
కాగా, పింకీ తమకు మార్చి నెల నుంచి కనిపించలేదని, ఆమె ఎక్కడికెళ్లిందని అడిగితే పుట్టింటికి వెళ్లిందని సంజయ్ చెప్పేవాడని, ఆ తర్వాత కొన్నాళ్లకు సంజయ్ కూడా ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయాడని పోలీసుల విచారణలో స్థానికులు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు.
పింకీతో తాను ఐదేళ్లపాటు సహజీవనం చేశానని, ఆమె తరచూ పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో వినోద్దవే అనే వ్యక్తి సాయంతో చంపేశానని పోలీసుల విచారణలో సంజయ్ పటిధార్ చెప్పాడు. దాంతో పింకీ హత్యలో సంజయ్‌కి సహకరించిన వినోద్ దవే కోసం పోలీసులు గాలించారు. అయితే దవే అప్పటికే మరో కేసులో రాజస్థాన్‌లోని జైలులో ఉన్నాడని గుర్తించారు. దవే అప్పగింతపై రాజస్థాన్పోలీసులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయన్నారు.