YSR Vahana Mitra: డ్రైవర్ల అకౌంట్లోకి రూ.10 వేలు, మూడో ఏడాది వైఎస్‌ఆర్ వాహనమిత్ర నిధులను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, 2.48 లక్షల మంది అకౌంట్లలో రూ.248.47 కోట్ల నగదు జమ
పాదయాత్రలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల కష్టాలను చవిచూసిన వైయస్ జగన్ వాహనమిత్ర పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఏటా జూలైలో విడుదల చేయాల్సి ఉండగా కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది నెల రోజుల ముందుగానే వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Amaravati, June 15: వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్ వాహనమిత్ర నిధులను ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) విడుదల చేసింది. పాదయాత్రలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల కష్టాలను చవిచూసిన వైయస్ జగన్ వాహనమిత్ర పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఏటా జూలైలో విడుదల చేయాల్సి ఉండగా కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది నెల రోజుల ముందుగానే వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan) మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్‌ఆర్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్ వాహనమిత్ర (YSR Vahana Mitra) అమలు చేశామని తెలిపారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల కష్టాలను పాదయాత్రలో చూశామన్న సీఎం జగన్.. టీడీపీ హయాంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లను పెనాల్టీలతో వేధించిన విషయాన్ని గుర్తుచేశారు. 3,648 కి.మీ సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని, 2.48 లక్షల మందికి రూ.248.47 కోట్ల నగదు జమ చేస్తున్నామన్నారు. 2.48 లక్షల మందిలో దాదాపు 84% పేదవర్గాల వారే ఉన్నారని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు.
కరోనా కష్టకాలంలో ఈ ఆర్ధిక సాయం ఎంతో మేలు చేస్తుందని, వాహన బీమాతో పాటు ఫిట్‌నెస్ సర్టిఫికెట్, రిపేర్లకు రూ.10వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు. వాహనంలో ప్రయాణించే వారికి కూడా భద్రత ఉంటుందని, వైఎస్ఆర్ వాహనమిత్ర దరఖాస్తుకు మరో నెలపాటు గడువు ఉందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడపొద్దని కోరుతున్నానని సీఎం జగన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. డ్రైవర్ల కష్టాలను పాదయాత్రలో సీఎం జగన్ చూశారని, కరోనా కష్టకాలంలో ఆర్ధిక సాయం ఎంతో ఉపయోగకరమని అన్నారు. షెడ్యూల్ కంటే నెల రోజుల ముందే వైఎస్ఆర్ వాహనమిత్ర సాయం విడుదల చేస్తున్నామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, కలెక్టర్ వినయ్ చంద్, ఎంపీ ఎంవీవీ, ఎమ్మెల్యేలు అమరనాథ్, గొల్ల బాబురావు పాల్గొన్నారు.
వాహనాల మరమ్మతులు, బీమా, ఇతర ఖర్చుల కోసం ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఈ ఏడాది 2,48,468 మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద ప్రయోజనం కలుగుతుంది. వరుసగా మూడో ఏడాది కూడా ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయటం విశేషం. నేడు జమ చేసిన నగదుతో కలిపి ఇప్పటివరకు రూ.759 కోట్లను డ్రైవర్లకు ప్రభుత్వం అందజేసింది.