Amaravati, June 15: మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మాన్సాస్) ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా (MANSAS trust chairman) సంచయిత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఆమె నియామకం చెల్లదని పేర్కొంది. మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో హైకోర్టు (Andhra Pradesh High Court) తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ట్రస్ట్ పరిధిలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ట్రస్ట్ విషయంలో కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామన్నారు.
ఏదైనా చట్టప్రకారమే అన్నీ జరుగుతాయని చెప్పారు. ఈ మేరకు సోమవారం మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ట్విట్టర్ పిల్లాడు లోకేష్ ప్రతి దాంట్లో వేలు పెడతాడని.. మాన్సాస్ ట్రస్ట్ గురించి ఆయనకు ఏమి తెలుసని ప్రశ్నించారు.లోకేష్ ఈ విషయం గురించి మాట్లాడటానికి అటు పిల్లాడు కాదు.. ఇటు పెద్దవాడు కాదని ఎద్దేవా చేశారు. ఒక కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చినంత మాత్రాన లోకేష్ గెలిచినట్టు కాదన్నారు. మాన్సాస్‌లో జరిగిన అక్రమాలను గుర్తించి చర్యలు చేపడుతున్నామన్నారు.
ఏది చేసినా చట్టప్రకారం, న్యాయబద్ధంగా చేస్తామని తెలిపారు. బ్రహ్మంగారి మఠం విషయంలో చట్టప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు. వీలునామా చట్టప్రకారం 90 రోజుల్లో ధార్మిక పరిషత్‌కు చేరాలన్నారు. పీఠాధిపతులతో కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రూల్స్ ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. శివస్వామి ముందుగా తన నిర్ణయం ప్రకటించడం సరికాదన్నారు. విషయం తేలే వరకు అక్కడ ఇన్‌చార్జ్‌ను నియమించామన్నారు.
మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజు (Sanchaita Gajapati Raju) నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. మాన్సాస్ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత గజపతిరాజు, ఊర్మిళా గజపతిరాజు, ఆర్‌వీ సునీతా ప్రసాద్‌లను నియమిస్తూ జారీ చేసిన జీవోను సైతం రద్దు చేసింది. అంతేకాకుండా సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌గా సంచయిత నియామక జీవోను సైతం కొట్టేసింది. ఇదే సమయంలో మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు (Ashok Gajapati Raju) నియామకం తిరిగి అమల్లోకి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడిగా/చైర్మన్‌గా 2016లో అశోక్ గజపతిరాజు నియామకం సక్రమంగానే జరిగిందని తెలిపింది.
ఏపీలో ఆలయాల విధ్వంసం, అదుపులో 5 మంది అనుమానితులు టీడీపీ నేత అశోక్ గజపతిరాజుపై వేటు
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మఠం వెంకటరమణ సోమవారం తీర్పు వెలువరించారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సంచయితను నియమిస్తూ ప్రభుత్వం గతేడాది జీవో 74ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత, ఊర్మిళ, ఆర్‌వీ సునీతా ప్రసాద్‌లను నియమిస్తూ మరో జీవో ఇచ్చింది. అదేవిధంగా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వంశపారంపర్య చైర్‌పర్సన్‌గా సంచైతను నియమిస్తూ మరో జీవోనూ జారీ చేసిన విషయం విదితమే.
ఈ మూడు జీవోలను సవాల్ చేస్తూ టీడీపీ సీనియర్ నేత, మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ వెంకటరమణ సోమవారం తీర్పు వెలువరించారు. అయితే తీర్పు కాపీ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో హైకోర్టు జీవోలను కొట్టేయడానికి గల కారణాలు తెలియరాలేదు.