Amaravati. Jan 2: ఏపీలో ఆలయాలపై దాడులు కలకలం రేపుతున్నాయి. వరుసగా జరుగుతున్న దాడులతో (Ramatheertham Incident) ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద ఫైర్ అవుతున్నాయి. తాజాగా రామతీర్థం క్షేత్రంలో కోదండరామస్వామి విగ్రహం శిరస్సు నరికివేయడంతో ఏపీలో దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ దేవతల విగ్రహాలు, ఆలయ ఆస్తులపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ రామతీర్థ ధర్మయాత్ర (Janasena-BJP Ramatirtha Dharma Yatra) చేపట్టాలని జనసేన, బీజేపీ నిర్ణయించాయి. ఈ నెల 5న జనసేన, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు యాత్రగా తరలి వెళ్లి రామతీర్థం ఆలయాన్ని సందర్శిస్తారు.
రామతీర్థం క్షేత్రంలో కోదండరామస్వామి విగ్రహం శిరస్సు నరికివేయడం, ఈ దుస్సంఘటన తర్వాత కూడా వరుసగా ఘటనలు జరుగుతున్నాయని జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ పరిణామాలను జనసేన, బీజేపీ ఖండిస్తున్నాయని పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరిట విడుదలైన ఓ ప్రకటనలో తెలిపారు.
రామతీర్థం ఘటనకు ముందు నుంచే పలు ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేశారని, రథాన్ని దగ్ధం చేశారని, అయితే ఈ దాడులపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించకపోవడాన్ని నిరసిస్తూ రామతీర్థ ధర్మ యాత్ర చేపడుతున్నట్టు వివరించారు. ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ ధర్మయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.
ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandra babu) రామతీర్థంలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అయోధ్యగా కొలుచుకునే రామతీర్థంలో విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా శ్రీరాముడికి అవమానం జరగిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు.
టీడీపీ హయాంలో ఒక్క ప్రార్థనాలయంపై కూడా దాడి జరగలేదని అన్నారు. ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? అని ప్రశ్నించారు. ఏపీలో రామతీర్థం, ఒంటిమిట్ట దేవాలయాలకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని చంద్రబాబు అన్నారు. 16వ శతాబ్దంలోనే పూసపాటి వంశీయులు రామతీర్థంలో ఆలయాలను నిర్మించారని చెప్పారు. దేవుడి ఆస్తులపై కన్నేసేవారు, వాటిని ధ్వంసం చేసేవారు మసైపోతారని అన్నారు.
దేవాలయాలకు వెళ్లి అన్యమత ప్రచారం చేస్తున్నారని... అంత పరమత విద్వేషం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాదాయశాఖ మంత్రి ఉన్నాడా? లేడా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. రామతీర్థంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఏం పని? అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. విగ్రహాల ధ్వంసం విషయంలో తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై తర్వాత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలయంలోకి విజయసాయిని అనుమతించారని... తనను అడుగడుగునా అడ్డుకున్నారని దుయ్యబట్టారు.
.
ఇక రామతీర్థం ఘటన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్రలో మూడు సుప్రసిద్ధ ఆలయాలకు ట్రస్టు చైర్మన్ గా ఉన్న టీడీపీ నేత అశోక్ గజపతిరాజుపై వేటు వేసింది. రామతీర్థం రామస్వామి ఆలయ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మందపల్లి మందేశ్వరస్వామి ఆలయం, విజయనగరం పైడితల్లి ఆలయాల ట్రస్టు చైర్మన్ బాధ్యతల నుంచి కూడా అశోక్ గజపతిని తొలగిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అశోక్ గజపతిరాజు తన చట్టబద్ధమైన బాధ్యతల నుంచి వైదొలగడంలోనూ, రామతీర్థం ఆలయ భద్రత అంశాల్లోనూ, విగ్రహ ధ్వంసం ఘటనల నివారణలోనూ విఫలమయ్యారని ఆ ఉత్తర్వుల్లో వివరించారు. ఈ కారణాలతో ఆయనను ఆయా ట్రస్టుల చైర్మన్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఆలయం వద్దకు వచ్చారు. కొండపైకి వెళ్తున్న విజయసాయిని టీడీపీ, బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోబ్యాక్ అంటూ నినదించారు. ఈ నేపథ్యంలో, పోలీసుల అండతో ఆయన కొండపైకి వెళ్లారు. ఆయన వెంట వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆయన కొండపై నుంచి కిందకు వచ్చారు. తన వాహనం ఎక్కి తిరుగుపయనం అవుతున్న విజయసాయికి చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ, బీజేపీ శ్రేణులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నాయి. పోలీసులు ఎంత ప్రయత్నించినా వారిని నిలువరించలేక పోయారు.
కారుపై చేతులతో బాదారు. చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. జైశ్రీరాం అంటూ నినదించారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో ఒక రాయి తగలడంతో విజయసాయి కారు అద్దం పగిలింది. దీంతో, ఆయన కారు నుంచి కిందకు దిగి, పోలీసుల సహకారంతో నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్లి, వేరే కారులో బయల్దేరారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాసేపట్లో చంద్రబాబు అక్కడకు చేరుకోనున్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. పొరుగుదేశాన్ని చూసైనా జగన్ రెడ్డి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ లో ఓ హిందూ దేవాలయాన్ని అల్లరిమూకలు ధ్వంసం చేస్తే, అక్కడి ప్రభుత్వం వెంటనే స్పందించిందని పవన్ వెల్లడించారు. 45 మంది నిందితులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా, దేవాలయాన్ని పునర్నిర్మించే బాధ్యతను కూడా తీసుకుందని వివరించారు. శత్రుదేశం పాటి చర్యలను కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకోలేదా? అని జనసేనాని ప్రశ్నించారు.
రామతీర్థం ఘటన, రాజకీయ రగడ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ప్రతిదీ రాజకీయం చేస్తూ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఘటన జరిగి ఇన్నిరోజులు గడిచినా ఇప్పటివరకు టీడీపీ నేతలను ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. స్థానికుడైన అశోక్ గజపతిరాజు ఎందుకు సందర్శించలేదని నిలదీశారు.
చంద్రబాబు ప్రయత్నాలన్నీ పబ్లిసిటీ కోసమేనని, ప్రచారం కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని విమర్శించారు. రామతీర్థంలో జరిగిన ఘటన ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం తప్ప, ఏ వ్యక్తికో, ఏ పార్టీకో సంబంధించిన అంశం కాదని బొత్స స్పష్టం చేశారు. సరిగా, డిసెంబరు 30న సీఎం జగన్ విజయనగరం వస్తున్నారని తెలిసి ఈ ఘటనకు పాల్పడినట్టు అర్థమవుతోందని, ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడానికి ఈ కుట్ర చేసినట్టు భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు.
రామతీర్థం ఆలయంలోని కోదండ రాముడి విగ్రహం ధ్వంసం చేసిన కేసులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు విజయనగరం డీఎస్పీ అనిల్ తెలిపారు. రామతీర్థం ఆలయం ఘటన విషయంలో కావాలనే కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన కార్యాలయంలో డీఎస్పీ అనిల్ మాట్లాడుతూ.. కోదండరాముడి విగ్రహం శిరస్సును ఛిద్రం చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు.
ఈ ఘటన ప్రధాన ఆలయంలో జరగలేదని, ఎదురుగా ఉన్న బోడికొండపై ఉన్న చిన్న ఆలయంలో చోటు చేసుకుందని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను నియమించామని చెప్పారు. శాంతి భద్రతలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రజలు, రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని కోరారు. ప్రధాన ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయని, కొండపై కూడా ఏర్పాటు చేయాలని ఇటీవలే దేవాదాయ శాఖకు లేఖ రాశామన్నారు. అయితే ఈ లోపే ఈ ఘటన జరిగిందని తెలిపారు.
కాగా, రాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నాయి. కాగా, శ్రీరాముడి విగ్రహ ధ్వంసంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవుడి ఊరికే వదిలిపెట్టడమని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.