Degree Courses in English Medium: ఇకపై డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే, అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుకోవాలని ఉన్నత విద్యామండలి సూచన
Exams Representational Image. |(Photo Credits: PTI)

Amaravati, June 15: ఏపీ రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులన్నీ ఇకపై ఆంగ్ల మాధ్యమంలో (Degree Courses in English Medium) మాత్రమే అమలు కానున్నాయి. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి (English-medium education) మార్చుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచించింది. ఈ మేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ బి. సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ (Council Secretary Prof. B. Sudhir Premkumar) సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలు రానున్న కొత్త విద్యా సంవత్సరం నుండి ఇంగ్లిష్‌ మీడియంలో మాత్రమే ప్రోగ్రాములను అందించాలని గత ఫిబ్రవరి 12న ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. దీని ప్రకారం కొత్త, అదనపు ప్రోగ్రామ్‌ల మంజూరు.. ఆయా కోర్సుల కాంబినేషన్‌ మార్పు, ప్రస్తుతం నడుస్తున్న మాధ్యమాన్ని ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చుకునేందుకు ఉన్నత విద్యా మండలి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది.

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు కరోనా తగ్గిన తర్వాతే..మీడియాతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల

ఈ మేరకు ఏప్రిల్‌ 27న నోటిఫికేషన్‌ జారీచేసిందని మండలి కార్యదర్శి ఆ ప్రకటనలో వివరించారు. అలాగే, 2021–22 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల అన్‌ఎయిడెడ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) హానర్స్‌ ప్రోగ్రాముల కోసం దరఖాస్తులను ఆంగ్ల మాధ్యమానికి మాత్రమే అనుమతిస్తామని కూడా స్పష్టంచేసింది.

ఇప్పటికే తెలుగు మాధ్యమంలో అన్‌ఎయిడెడ్‌ కోర్సులను అందిస్తున్న అన్ని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ కాలేజీలు ప్రస్తుతం ఉన్న అన్ని తెలుగు మీడియం విభాగాలను ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చుకునేందుకు ప్రతిపాదనను పంపించాలని మండలి సూచించింది. లాంగ్వేజ్‌ కోర్సులు మినహాయించి ఇతర విభాగాల కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చడానికి ఈనెల 18 నుంచి 28వ తేదీలోపు ఉన్నత విద్యా మండలికి ప్రతిపాదనలు సమర్పించాలని పేర్కొంది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, జూన్ 30 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు, జూన్ 3తో ముగియనున్నఈ ఏడాది విద్యా సంవత్సరం, ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు వాయిదా

అలా ఇవ్వని పక్షంలో 2021–22 నుండి ఆయా కోర్సుల నిర్వహణకు అనుమతులివ్వలేమని స్పష్టంచేసింది. గడువు దాటాక ఎలాంటి ప్రతిపాదనలను స్వీకరించబోమని పేర్కొంది. అలాగే, అన్‌ఎయిడెడ్‌ ప్రోగ్రాములలో నిర్వహణ సాధ్యంకాని, నిర్వహించని యూజీ ప్రోగ్రాములను ఉపసంహరించుకోవాలనుకునే ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలు తమ ప్రతిపాదనలను కూడా ఈనెల 18 నుంచి 28లోగా సమర్పించాలని సూచించింది. మీడియం మార్పిడి, ప్రోగ్రామ్‌ల ఉపసంహరణకు ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదని మండలి పేర్కొంది.

ఇప్పటికే తెలుగు మీడియం చదువుతున్న 65,981 మంది విద్యార్థులు యధాతథంగా ఆయా కోర్సుల్లో కొనసాగుతారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా చేరే విద్యార్థులకు మాత్రమే ఇంగ్లిష్‌ మీడియం అమలవుతుంది.