Eluru Mysterious Illness: ఏలూరుకు చేరుకున్న ఏపీ సీఎం, అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన వైయస్ జగన్, అధికారులతో సమీక్ష సమావేశం
హెలీప్యాడ్ నుంచి నేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం జగన్ అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను (AP CM YS Jagan arrives in Eluru)a పరామర్శించారు.
Eluru, Dec 7: ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం జగన్ అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను (AP CM YS Jagan arrives in Eluru)a పరామర్శించారు. సీఎం జగన్ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.
బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దేవరపల్లికి చేరుకొని గోపాలపురం ఎమ్మెల్యే తల్లారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.
ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే సీఎం జగన్ ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి నాని ఆదివారం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించడమే కాకుండా వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో స్వయంగా పర్యవేక్షించారు.
AP CM YS Jagan arrives in Eluru, consoles the victims of mysterious Illness
సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఏలూరులో బాధితులను పరామర్శించి అస్వస్థతకు దారితీసిన కారణాలపై పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఏలూరులో పర్యటించి అధికారులతో సమావేశంకానున్నారు.
YSR Congress Party Tweet
శనివారం సాయంత్రం నుంచి ఏలూరులో ఫిట్స్ వ్యాధి లక్షణాలతో ప్రజలు ఆసుపత్రుల్లో చేరటం ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. ఆకస్మికంగా కింద పడిపోవటం, కొందరికి నోటి వెంట నురగలు రావటం, వాంతులు చేసుకోవటం, స్పృహ కోల్పోవటం వంటి లక్షణాలతో అనారోగ్యానికి గురికావటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన ఈ వ్యాధి ప్రభావం ఆదివారం నెమ్మదించింది. సాయంత్రానికి బాధితుల సంఖ్య 286కు చేరింది.
తొలుత ఏలూరు దక్షిణపు వీధి, పడమర వీధిలో ప్రారంభమైన ఈ వ్యాధి (Eluru Mysterious Illness) లక్షణాలు ఆదివారం ఉదయానికి నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు విస్తరించాయి. ఆదివారం సాయంత్రం వరకు ఆస్పత్రుల్లో చేరిన 286 మంది బాధితుల్లో 117 మంది కోలుకుని ఇంటికి చేరుకున్నారు. మిగతా వారు కోలుకుంటున్నారు. కాగా, విద్యానగర్‌కు చెందిన శ్రీధర్ (45) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బాత్‌రూమ్‌కు వెళ్లి తల తిరిగి కింద పడిపోయాడు. చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.
ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో పూర్తిగా బాధితుల కోసమే వార్డులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 300 బెడ్స్‌ను సిద్ధంగా ఉంచిన అధికారులు, అవసరమైతే ఆశ్రం ఆస్పత్రి, ఇతర ప్రైవేట్ ఆస్పత్రులను స్వాధీనం చేసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానితో పాటు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఏలూరు ఆర్‌డీవో పనబాక రచన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సునంద, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ మామిళ్లపల్లి జయప్రకాష్, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వరప్రసాద్ జిల్లా ఆసుపత్రిలో మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
అంతుచిక్కని వ్యాధి నిర్ధారణ, వైద్య చికిత్సల నిమిత్తం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని దక్షిణపు వీధి, పడమర వీధి ప్రాంతాలతో పాటు ప్రభావిత ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. బాధితులు ఉంటున్న ప్రాంతాల్లో అశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలతో ఇంటింటా ఆరోగ్య స్థితిపై సర్వే చేపట్టారు. ఎవరైనా అనారోగ్యంతో బాధ పడుతుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లేలా సూచనలు చేస్తున్నారు.
ఏలూరు నగరంతో పాటు తంగెళ్లమూడి, ఖండికగూడెం ప్రాంతాల్లో తాగునీటి ట్యాంకులు, డ్రైయినేజీలను శుభ్రం చేయటం, బ్లీచింగ్ చల్లటం వంటి కార్యక్రమాలు చేపట్టారు. విజయవాడ నుంచి ప్రత్యేక వైద్య బృందాలు ఏలూరు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. వారు కూడా మంచినీటి శాంపిల్స్ టెస్టింగ్ నిర్వహించారు. నీటి శాంపిల్స్ అన్నీ బాగుండటం, బాధితులకు చేసిన సీటీ స్కాన్, రక్త పరీక్షలు కూడా నార్మల్ అని రావడంతో అసలు ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతోందనే దానిపై స్పష్టత రాలేదు. దీంతో సోమవారం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ బృందాన్ని రప్పిస్తున్నారు.
ఐపీఎం (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రీవెంటివ్ మెడిసిన్) అధికారుల బృందం ఏలూరుకు చేరుకుంది. ఇప్పటి వరకు చేసిన టెస్టుల ఫలితాలన్నీ నార్మల్‌గా ఉన్నాయి. దీంతో కల్చర్ టెస్టు కోసం రక్త నమూనాలను విజయవాడలోని వీఆర్‌డీఎల్ ల్యాబొరేటరీకి పంపించారు. పాలలో హెవీ మెటల్స్, పెస్టిసైడ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది పరిశీలిస్తున్నారు. ఏలూరు బాధితుల నుంచి రక్త నమూనాలు, అక్కడి నీటి నమూనాలు సేకరించి పరిశీలించామని, ఫలానా కారణమంటూ ఏమీ తేలలేదని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. ఈకోలీ పరీక్ష ఫలితం రావాల్సి ఉందన్నారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వారు సోమవారం ఏలూరు నగరానికి వస్తున్నారని, తాగునీటిపై వారు మరిన్ని పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. కాగా, ఇది ప్రమాదకరం కాదని ప్రాథమికంగా అంచనా వేశామని, అందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గీతాప్రసాదిని విజయవాడలో పేర్కొన్నారు.