AP Coronavirus Update: ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు ఏపీ సర్కారు కీలక ఆదేశాలు, సీటీ స్కాన్ ధర రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో సీటీ స్కాన్ ధర రూ.3 వేలుగా (Fixes CT scan prices) నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
Amaravati, April 25: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా సీటీ స్కాన్‌పై ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు (AP government issues directives to hospitals and labs) జారీ చేసింది. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో సీటీ స్కాన్ ధర రూ.3 వేలుగా (Fixes CT scan prices) నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
దీనిని మించి అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది. సీటీ స్కాన్, పాజిటివ్ వచ్చిన వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్-19 డాష్ బోర్డులో పాజిటివ్ వచ్చిన వారి వివరాలు నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా, కోవిడ్ రోగుల చికిత్సలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1.01 లక్షల మంది కోవిడ్ రోగులకు ఉచితంగా వైద్యసేవలను అందించింది. ఇందుకోసం ఏకంగా రూ.309.61 కోట్లను ఖర్చు చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు ప్రభుత్వం ఉచిత చికిత్సలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ నెల 23 వరకు మొత్తం 1,01,387 మంది బాధితులు ఉచిత వైద్యం పొందారు.
కరోనా వైరస్ నియంత్రణలో కలెక్టర్లదే కీలక పాత్ర అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కలెక్టర్లు వ్యక్తిగతంగా కోవిడ్ ఆసుపత్రులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జిల్లాలో శానిటైజేషన్ చేయడం, మాస్క్‌లు ధరించడం సహా భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. 104కు కాల్ చేసే ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ సంక్షోభంలో కలెక్టర్లు అత్యుత్తమ పనితీరు కనబర్చాలని తెలిపారు.
దేశంలో కరోనా రెండోదశ తీవ్ర ఉపద్రవంలా మారిందని మంత్రి వెల్లంపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు చూపుతోనే ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని వెల్లంపల్లి అన్నారు. తొలిదశ తరహాలోనే సెకండ్‌వేవ్‌లో కరోనా కట్టడికి అన్నివిధాల చర్యలు చేపట్టామని వెల్లంపల్లి పేర్కొన్నారు. కరోనా బాధితులకు తక్షణ సేవలందించడం కోసం కమాండ్ కంట్రోల్ సదుపాయాన్ని బలోపేతం చేశామని స్పష్టం చేశారు.
విజయవాడలో ఇప్పటికే 42 ఆస్పత్రుల్లో 3500 బెడ్‌లు సిద్ధం చేశామని.. అదేవిధంగా, కరోనా బాధితుల కోసం కోవిడ్ కేర్ సెంటర్‌లో 2500 ప్రత్యేక బెడ్‌లను ఏర్పాటు చేశామని మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎల్లవేళలా కృషిచేస్తుందని, మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ప్రజలకు అన్నిరకాల సేవలందిస్తోందని తెలిపారు.
కరోనా కట్టడిపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి హాజరయ్యారు. సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, కరోనా పేరుతో బాధితులను వేధిస్తే సహించమని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వైద్యం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
రెమిడెసివర్ ఇంజక్షన్లు బ్లాక్‌లో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఆక్సిజన్ స్టోరేజీపై ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. టెస్టులు చేసిన రోజే రిపోర్ట్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందు జాగ్రత్తగా అదనంగా వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అవసరాన్ని బట్టి కాలేజీలను కోవిడ్ ఆస్పత్రులుగా మారుస్తామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.
దర్గామిట్ట ప్రభుత్వాస్పత్రిలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆకస్మిక తనిఖీ చేశారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా బాధితులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. నిన్న (శనివారం) కూడా ఆసుపత్రుల్లో మంత్రి అనిల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని నారాయణ కోవిడ్ ఆసుపత్రి డాక్టర్లకు మంత్రి సూచించారు.