Geneva, April 25: ఇండియాలో పెరుగుతున్న కరోనా సెకండ్ వేవ్ ఇన్ఫెక్షన్ కేసుల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన (Coronavirus Scare) వ్యక్తం చేసింది. ‘భారత్‌లో పరిస్థితులు చాలా క్షిష్టతరంగా ఉన్నాయని తెలుసు. కరోనావైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నాం. కరోనాతో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) తెలిపింది.
ఈ విపత్కర పరిస్థితుల్లో భారత ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉంటాం. ప్రాణాలను కాపాడేందుకు సాధ్యమైనదంతా చేస్తాం. వైరస్ ఎంత వినాశనం సృష్టించగలదో భారత్‌లోని పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ప్రజారోగ్య చర్యలు, వ్యాక్సిన్లు, చికిత్సతో వైరస్‌ను ఎదుర్కోవాలని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధోనం ఘెబ్రేయెస్ (Tedros Adhanom Ghebreyesus) పేర్కొన్నారు.
జెనీవాలో జరిగిన వర్చువల్ బ్రీఫింగ్ సందర్భంగా ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత, రెమ్‌డెసివిర్ వంటి ప్రధాన అత్యవసర ఔషధాల కొరత కారణంగా భారత్‌లో ప్రతి రోజు గడిచేకొద్దీ పరిస్థితి చేతులెత్తేస్తున్నట్లు కనిపిస్తోంది అని ఘెబ్రేస్ తెలపారు.
కరోనా యొక్క కొత్త వేరియంట్ మరింత వ్యాప్తి
కాగా 25 నుంచి 59 ఏండ్ల మధ్య వయస్కుల్లో ఇన్‌ఫెక్షన్ వేగంగా పెరుగుతున్నదని ట్రెడోస్ చెప్పారు. కరోనా యొక్క కొత్త వేరియంట్ మరింత వ్యాప్తి చెందే ఫలితం కావచ్చునన్నారు. ప్రపంచవ్యాప్తంగా మరింత వేగంగా టీకాలు వేయడం అవసరమని పేర్కొన్నారు. ఆగ్నేయాసియాలో ఇన్‌ఫెక్షన్ మరణాల సంఖ్యను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు, అనేక దేశాల్లో ఉన్న భారతీయ మిషన్లు అక్కడ ప్రభుత్వాలు, సంస్థలతో ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌తోపాటు ఇతర ఔషధాల కోసం చర్చలు జరుపుతున్నాయి.
అండగా ఉంటామని తెలిపిన ప్రపంచ దేశాలు
యూఏఈ, సింగపూర్, మరికొన్ని ఆగ్నేయాసియా దేశాల నుంచి ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రష్యా కూడా ఆక్సిజన్ సరఫరాకు సహాయం చేయడానికి ముందుకొచ్చింది. కరోనా రెండో వేవ్‌తో తీవ్ర ఇబ్బంది పడుతున్న భారత్‌కు అన్నివిధాలా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మక్రాన్ అన్నారు.
‘కరోనా కేసులు పెరిగి ఇబ్బంది పడుతున్న భారత ప్రజలకు నేను సంఘీభావ సందేశం పంపాలని అనుకుంటున్నా. ఈ కష్టకాలంలో ఫ్రాన్స్ మీకు తోడుగా ఉంటుంది. ఈ మహమ్మారి ఎవరినీ విడిచిపెట్టదు. మేం అన్నివిధాలా భారత్‌కు మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని మక్రాన్ పేర్కొన్నారు. ఫ్రెంచ్ రాయబారి ఇమాన్యుయేల్ లెనైన్ తన అధికార ట్విట్టర్లో దేశాధినేత సందేశాన్ని పోస్టు చేశారు.
Here's Emmanuel Lenain Tweet
❝I want to send a message of solidarity to the Indian people, facing a resurgence of COVID-19 cases. France is with you in this struggle, which spares no-one. We stand ready to provide our support.❞
— President Emmanuel Macron
— Emmanuel Lenain (@FranceinIndia) April 23, 2021
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌తో అతలాకుతలం అవుతున్న ఇండియాకు అవసరమైన సహాయం చేయడానికి సిద్ధమని ప్రకటించింది చైనా. గురువారం ఆ దేశ అధికార మీడియాతో మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ ఈ ప్రకటన చేశారు. మహమ్మారి మానవాళి మొత్తానికీ శత్రువుని, ఈ సమయంలో అంతర్జాతీయ సంఘీభావం, పరస్పరం సహాయం చేసుకోవడం అవసరమని ఆయన అన్నారు. ఇండియాలో ఉన్న దారుణమైన పరిస్థితుల విషయం చైనా గమనించిందని, అక్కడ తాత్కాలిక మందుల కొరత ఉన్నదని చెప్పారు. మహమ్మారిని అదుపులోకి తీసుకురావడానికి అవసరమైన సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
Here's ANI Tweet
US is deeply concerned by severe COVID outbreak in India. We're working around the clock to deploy more supplies and support to our friends and partners in India as they bravely battle this pandemic. More very soon: White House National Security Advisor, Jake Sullivan
(file pic) pic.twitter.com/E4P6ZyNDlh
— ANI (@ANI) April 25, 2021
ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు దిగి వచ్చింది. ఇండియాకు అవసరమైన అదనపు సాయాన్ని శరవేగంగా అందించనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇండియాకు సాయం చేయాలంటూ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్‌తోపాటు అక్కడి చట్టసభల ప్రతినిధులు, ప్రముఖ ఇండియన్-అమెరికన్‌లు బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లతోపాటు అవసరమైన ఇతర కొవిడ్ మందులను సరఫరా చేయాలని వాళ్లు డిమాండ్ చేశారు.
దీనిపై బ్లింకెన్ స్పందించారు. కొవిడ్ మహమ్మారితో సతమవుతున్న భారత ప్రజలకు అండగా ఉంటాం. భారత ప్రభుత్వంలో ఉన్న మా భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం. ఇండియాకు అవసరమైన అదనపు సాయాన్ని శరవేగంగా అందిస్తాం అని బ్లింకెన్ చెప్పారు. అటు వైట్‌హౌజ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సల్లివాన్ కూడా దీనిపై స్పందించారు. ఇండియాలో కొవిడ్ పరిస్థితులపై అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇండియాలోని స్నేహితులు, భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాం. కొవిడ్‌పై పోరాడుతున్న ఇండియాకు మరింత సాయం చేయడానికి 24 గంటలూ శ్రమిస్తున్నామని ఆయన అన్నారు.
బైడెన్ ప్రభుత్వం విమర్శలు
కాగా అమెరికాలో కరోనా విజృంభించిన సమయంలో ఇండియా ముందుకు వచ్చి సాయం చేసినా.. ఇప్పుడు అగ్రరాజ్యం మాత్రం ఆ పని చేయకపోవడంపై బైడెన్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. అమెరికా స్టోరేజ్‌లో ఉన్న కోట్లాది ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను ఇండియాకు ఇవ్వాలని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్‌తోపాటు కాంగ్రెస్ సభ్యులు రోఖన్నా, రాజా కృష్ణమూర్తి బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం అమెరికాలో 4 కోట్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ డోసులు ఉన్నట్లు కృష్ణమూర్తి తెలిపారు. వీటిని అమెరికా ఉపయోగించడం లేదని, మెక్సికో, కెనడా కోసం పక్కన పెట్టిన వీటిలో నుంచి ఇండియాకు కూడా ఇవ్వాలని ఆయన కోరారు.
భారత దేశం అత్యంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది
భారత్‌లో పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడి అత్యున్నత స్థాయి వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌసీ స్పందించారు. ప్రస్తుతం భారత దేశం అత్యంత భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నదని డాక్టర్ ఆంథోనీ ఫౌసీ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్ చాలా ఘోరమైన స్థితిని ఎదుర్కొంటున్నదని చెప్పారు. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంత అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు భారత్‌లో నమోదవుతున్నాయన్నారు.
భారత్‌లోని కరోనా వైరస్ రూపాల లక్షణాలు ఇంకా స్పష్టంగా తెలియడం లేదన్నారు. అంతేగాక, కరోనా వైరస్ రూపాల నుంచి కాపాడగలిగే సామర్థ్యం వ్యాక్సిన్లకు ఉందా? అనే విషయం కూడా ఇంకా పూర్తిగా తెలియదన్నారు ఫౌసీ. భారత దేశానికి వ్యాక్సిన్లు అవసరమనే విషయం స్పష్టమవుతోందని చెప్పారు. అమెరికన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ భారత దేశంలోని ఆరోగ్య వ్యవస్థతో కలిసి పని చేస్తున్నదని ఆయన తెలిపారు.