Visakha Steel Plant Privatization: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగదన్న కేంద్రం, ప్రైవేటీకరణపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ధర్నా
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై (Visakha Steel Plant Privatization) పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అలాగే ప్రైవేటీకరణపై కేంద్రం (Cetnral government) దాఖలు చేసిన కౌంటర్‌కు రిప్లై దాఖలు చేస్తామని, ఇందుకు కొంత గడువునివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది.
Visakhapatnam, August : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై (Visakha Steel Plant Privatization) పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అలాగే ప్రైవేటీకరణపై కేంద్రం (Cetnral government) దాఖలు చేసిన కౌంటర్‌కు రిప్లై దాఖలు చేస్తామని, ఇందుకు కొంత గడువునివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. రిప్లై దాఖలుకు గానూ తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి దాఖలైన మరో వ్యాజ్యంలో కూడా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ఉక్కు శాఖ కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు.
కేంద్రం దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానం ఇస్తామని గడువునివ్వాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ, కేంద్ర ప్రభుత్వం తరఫున కౌంటర్ వేశామని, ఒక్కో శాఖ తరఫున ఒక్కో కౌంటర్ అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ, తాము కూడా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సమీక్షించే ప్రతిపాదన ఏదీ లేదని సోమవారం లోక్‌సభలో స్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్‌రావ్ కరాద్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ ఏడాది జనవరి 27న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్వహించిన సమావేశంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ ఉక్కు పరిశ్రమ) ప్రైవేటీకరణలో భాగంగా వందశాతం పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయ అనుమతి తెలిపిందని పేర్కొన్నారు. దీన్లో కేంద్ర ప్రభుత్వ వాటాతోపాటు అనుబంధంగా ఉన్న సంస్థలు, సంయుక్త భాగస్వామ్యసంస్థల వాటాలను 100 శాతం ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన గళాన్ని వినిపించేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నా సమయానికి జంతర్‌మంతర్ చేరుకున్న కార్మికులు జోరువానలోనూ నిరసన గళాన్ని వినిపించారు. స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, ఎల్‌జేడీ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూయూ, ఐద్వా సంఘీభావం తెలిపాయి.
ప్రజల త్యాగాలతో ఏర్పాటైన ఉక్కు పరిశ్రమను (Visakhapatnam Steel Plant (VSP) ప్రైవేటీకరించకుండా పార్లమెంట్‌లో పోరాడుతామని సీపీఎం పార్లమెంటరీ పార్టీ నేత ఎలమరం కరీం ప్రకటించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రధాని మోదీ సర్కార్ వేగవంతం చేసిందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ విమర్శించారు. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల పోరాటం దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. పలు అంశాల్లో ఏకాభిప్రాయం లేని పార్టీలు సైతం విశాఖ ఉక్కు కోసం ఐక్యంగా పోరాడుతున్నాయని, ఈ పంథాను ఇలాగే కొనసాగించాలని సూచించారు
కేంద్ర ప్రభుత్వం అనేక విషయాల్లో మూర్ఖత్వంతో వ్యవహరిస్తోందని, అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. ఒకవైపు విశాఖ ఉక్కు నాణ్యమైనదంటూ ప్రకటించి మరోవైపు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ హెచ్చరించారు. కలసికట్టుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుందామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ సూచించారు.
ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటంచేసి విశాఖ ఉక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్‌పరం కాకుండా జరిపే పోరాటంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఘీభావం సంపూర్ణంగా ఉంటుందన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం పావులు కదుపుతున్నట్లుగా తెలిసిన వెంటనే సీఎం వైఎస్ జగన్ విశాఖలో ప్రత్యామ్నాయ మార్గాలపై కార్మిక సంఘాల నేతలతో గత ఫిబ్రవరిలో చర్చించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారన్నారు. కర్మాగారానికి సొంతంగా ఇనుప ఖనిజం, బొగ్గు గనులు కేటాయించాలని.. అలాగే, రూ.22 వేల కోట్ల రుణ భారానికి సంబంధించిన వడ్డీ చెల్లింపులపై రెండేళ్లపాటు మారటోరియం విధించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)