Vizag Steel Plant (Photo-Twitter)

Visakhapatnam, Feb 6: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీలో రాజకీయ పార్టీలు అన్నీ ఏకమవుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు (Vizag Steel Plant Privatisation) కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు, పలు రాజకీయ పార్టీల నేతలు రొడ్డెక్కారు. అందరూ కలిసి విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించి.. తమ ఆందోళనను నిర్వహిస్తూ చాటిచెబుతున్నారు.

ఉద్యమకారుల త్యాగాలను వృథా కానివ్వబోమని, ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను (Vizag Steel Plant) ప్రైవేటీకరణ కానివ్వబోమని ప్రతినబూనారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు, కార్మికులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ సహా 16 కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీ నేతలు శుక్రవారం నగరంలో భారీ ర్యాలీ చేశారు.

కార్మికుల ఆందోళనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ప్రాణాలు త్యాగం చేసైనా విశాఖ ఉక్కును సాధించుకుంటామని నినాదాలు చేశారు. ఆంధ్రుల గుండెకాయలాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను మోదీ ప్రభుత్వం లోపాయికారీగా ప్రైవేటుపరం చేయడానికి సిద్ధమైంది. దీనిని ప్రతిఘటించిన కార్మిక వర్గం మహాత్తర పోరాటానికి సన్నద్ధమవుతోంది.

అక్కడ ఏకగ్రీవాలను ఆపండి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను ప్రకటించవద్దని తెలిపిన ఎస్ఈసీ నిమ్మగడ్డ, మండిపడుతున్న అధికార పక్షం నేతలు, తొలి విడతలో 523 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం, ఈసీ ఈ–వాచ్‌ యాప్‌పై 9వ తేదీ వరకు ఏపీ హైకోర్టు స్టే

లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌ పరం కానివ్వబోమని కార్మిక సంఘాలు స్పష్టం చేశారు. వేలాది ఎకరాల భూమిని రైతులు త్యాగం చేసి స్టీల్‌ ప్లాంట్‌కు అందిస్తే.. దాన్ని పోస్కోకు కట్టబెట్టాలని ప్రయత్నించడం దారుణమంటూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు.

Here's Movement Updates: 

కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనిపక్షంలో.. అవసరమైతే రాజీనామాకైనా సిద్ధమేనని ప్రకటించారు. స్టీల్‌ప్లాంట్‌ విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పార్లమెంట్‌లో స్టీల్‌ప్లాంట్‌ అంశంపై గళమెత్తుతామన్నారు. ఇప్పటికే స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయొద్దని కోరుతూ ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు లేఖలు రాసినట్లు చెప్పారు. ఆందోళనలో అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, కార్మిక సంఘ నాయకుడు మంత్రి రాజశేఖర్‌తో పాటు కార్మిక సంఘాల నాయకులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

32 మంది ప్రాణ త్యాగంతో, 70 మంది ప్రజాప్రతినిధులు రాజీనామాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ను బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించకుండానే లోపాయికారీగా ప్రైవేటువారి చేతిలో పెట్టడానికి సిద్ధమైంది. విశాఖ ఉక్కు పరిశ్రమ 100 శాతం ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడంతో, దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది. 20 ఏళ్లగా కేంద్ర ప్రభుత్వం పలు మార్లు ప్లాంట్‌ వాటాల విక్రయానికి పూనుకోగా తీవ్రంగా ప్రతిఘటించిన కార్మిక వర్గం, మరోసారి మహాత్తర పోరాటానికి సన్నద్ధమవుతోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి, TDP ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు . లేదంటే ఢిల్లీ రైతుల ఉద్యమానికి వంద రెట్ల స్థాయిలో తీవ్రతను వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్రాన్ని హెచ్చరించారు.విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దేశంలోని మిగతా పరిశ్రమల్లా చూడొద్దని, విశాఖ ఉక్కు తమ ఆత్మ గౌరవమని ట్వీట్‌ చేశారు గంటా శ్రీనివాసరావు. మా విశాఖ ప్రజల ఉఛ్వాస నిశ్వాస…. మా నగరం పేరే ఉక్కు నగరం… మా సెంటిమెంట్‌ని ముట్టుకోవద్దని కేంద్రాన్ని కోరారు. విశాఖ ఉక్కు నుంచి విశాఖను వేరు చేయడం అంటే తమ ప్రాణాల్ని తమ దేహాల నుంచి వేరు చేయడమేనన్నారు. విశాఖ ఉక్కు 5 కోట్ల ఆంధ్రులు, 20 కోట్ల తెలుగు ప్రజల మనోభావాలు, రాజీ లేని పోరాటాలకు ప్రతీకని పేర్కొన్నారు. దయచేసి మా సెంటిమెంట్ ని ముట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు.