Covid in AP: ఏపీలో పెరుగుతున్న డిశ్చార్జ్ రేటు, తాజాగా 15,958 మంది కోలుకుని ఇంటికి, గత 24 గంటల్లో కొత్తగా 10,373 కేసులు, 1.06 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపిన సింఘాల్
నిన్న ఒక్కరోజే కరోనాతో 80 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11,376కి చేరింది.
Amaravati, June 5: ఏపీలో గత 24 గంటల్లో 88,441 మంది నమూనాలు పరీక్షించగా 10,373 కొత్త కేసులు (New Coronavirus Positive Cases) నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 80 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11,376కి చేరింది. గడచిన 24 గంటల్లో 15,958 మంది కొవిడ్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,28,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 16,09,879 మంది రికవరీ అయ్యారు. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 17,49,363కి కరోనా కేసులు చేరాయి.
కొత్తగా చిత్తూరు జిల్లాలో 12 మంది మృతి చెందారు. అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందారు. కర్నూలు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా జిల్లాలో 4, ప్రకాశం 3, కడపలో ఒకరు చొప్పున మృతి చెందారు.
ఏపీలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మీడియాకు వివరాలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోందని సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో కోటి 6లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిందని వెల్లడించారు. 45 ఏళ్లు దాటిన వారిలో 50శాతం మందికి ఒక డోసు పూర్తి చేశామని వివరించారు.
వివిధ ఆసుపత్రుల్లో 406 టన్నుల ఆక్సిజన్ వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 1,460 మ్యూకర్ మైకోసిస్ కేసులు నమోదయ్యాయని ఏకే సింఘాల్ తెలిపారు. 11వ విడత ఫీవర్ సర్వే పూర్తయిందని, కాల్ సెంటర్‌కు వచ్చే ఫోన్లు కూడా క్రమంగా తగ్గుతున్నాయన్నారు.
Here's AP Covid Report
ఇక, వ్యాక్సినేషన్ పై వివరణ ఇస్తూ, ఇప్పటివరకు 1.06 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చామని వెల్లడించారు. 45 ఏళ్లు దాటినవారిలో 50 శాతం మందికి ఒక డోసు పూర్తయిందని తెలిపారు. పిల్లలకు కరోనా సోకడంపై టాస్క్ ఫోర్స్ కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. థర్డ్ వేవ్ లో జన్యుఉత్పరివర్తనాలతో కూడిన కరోరా వేరియంట్ల కారణంగా పిల్లలు హైరిస్క్ గ్రూపులో ఉంటారని వెల్లడించారు. 1, 2వ వేవ్ లో ఎందరు పిల్లలకు కరోనా వచ్చిందో చూసి మూడో వేవ్ పై అంచనా వేస్తామని తెలిపారు. 18 ఏళ్లు దాటిని వారికి కనీసం ఒక్క డోసైనా వ్యాక్సిన్ పూర్తవుతుందని భావిస్తున్నామని అన్నారు.
కారంచేడు వైద్యుడు భాస్కరరావు కొవిడ్ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. చికిత్సకయ్యే ఖర్చును సీఎం జగన్ విడుదల చేశారని సింఘాల్ వెల్లడించారు. అటు, నెల్లూరు జీజీహెచ్ లో వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. జిల్లా అధికారుల కమిటీతో పాటు వైద్య కళాశాల ప్రిన్సిపల్ కమిటీ కూడా విచారణ చేపడుతుందని వివరించారు. ఈ రెండు కమిటీల నివేదికలు సోమవారంలోగా అందే అవకాశముందని, నివేదికల్లోని అంశాలను పరిశీలించాకే ఏ చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని చెప్పారు.