Amaravati, June 5: ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (AP Education Minister Adimulapu Suresh) స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిస్థితులు అనుకూలిస్తే టెన్త్ పరీక్షలు (10th class Exams) నిర్వహిస్తామని వెల్లడించారు. టెన్త్ పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సరికాదన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు టెన్త్ ప్రామాణికమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సిన ఎస్‌ఎస్‌సి- 2021 పరీక్షలను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూ అమలులో ఉంది. కేసులు ఇప్పటికీ ఎక్కువగానే వస్తున్న కారణంగా కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా టీచర్లకు వ్యాక్సినేషన్ మొదలగు అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర సర్కార్ పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చింది. జూలైలో పరిస్థితులను మళ్లీ సమీక్షించి పదో తరగతి పరీక్షలపై అప్పుడు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
కరోనా నేపథ్యంలో 2020-21 సంవత్సరానికి ఎస్‌ఎస్‌సి సిలబస్‌ను ఏపి ప్రభుత్వం తగ్గించింది. అంతేకాకుండా సాధారణంగా ఉండే 11 పేపర్లకు బదులుగా 7 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించాలని భావించారు. ఎలాగైనా జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించే తీరాలని పట్టుదలతో ఉండటంతో కొంతమంది సామాజిక కార్యకర్తలు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయాలని కొందరు, టీచర్లకు టీకాలు వేసిన తర్వాతే పది పరీక్షలు నిర్వహించాలని కొందరు తమ పిటిషన్లో కోరారు.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరగా, జూన్ చివరి వరకు పరీక్షలను వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. పాఠశాలలు కూడా ఇప్పట్లో ప్రారంభించడం లేదని వివరించింది. పరిస్థితిని విశ్లేషించిన తర్వాతే జూలై నెలలో కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కోవిడ్ ఉధృతి దృష్ట్యా ప్రభుత్వం అంతకుముందు ఇంటర్మీడియట్ పరీక్షలను కూడా వాయిదా వేసిన విషయం తెలిసిందే.