Konaseema Violence: కోనసీమలో నిప్పు రాజేసిందే వాళ్లే, ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన మంత్రి బొత్స, ప్లాన్ ప్రకారమే అమలాపురంలో విధ్వంసమని తెలిపిన సజ్జల, మంటల్లో కాలిపోయిన ఇంటిని పరిశీలించిన విశ్వరూప్
కోనసీమ అమలాపురం ఘటన దురదృష్టకరమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన (Konaseema Violence) వెనక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఈ అల్ల
Amalapuram, May 25: కోనసీమ అమలాపురం ఘటన దురదృష్టకరమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన (Konaseema Violence) వెనక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఈ అల్లర్ల వెనక ఎవరున్నారో అందరికీ తెలుసని.. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంత్రి, ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టడం హేయమైన చర్య (Amalapuram Protest) అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు మంచివి కావని హితవు పలికారు.
స్వార్థ రాజకీయాల కోసం విపక్షాల కుట్రను ప్రజలు గమనించాలని మంత్రి బొత్స (Minister Botsa Satyanarayana) పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆలోచన అని అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టాలన్న నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అమలాపురంలో కాల్పులు జరిగితే లబ్ధి పొందాలని పవన్ చూస్తున్నారా అని నిలదీశారు. పోలీసులు సంయమనం పాటించి ప్రాణ నష్టం లేకుండా నివారించారన్నారు.
మంత్రి, ఎమ్మెల్యేల ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. అంబేద్కర్ ఒకకులానికో, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు. అంబేద్కర్ రాజ్యాంగ సృష్టి కర్త. ఈరోజు మనం స్వేచ్చగా జీవించడానికి అంబేద్కర్ రాజ్యాంగమే కారణం. అటువంటి మహానుభావుడు పేరు పెడితే ఎందుకు అల్లర్లకి పాల్పడ్డారు. అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు కోనసీమకి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరిన మీదటే సీఎం నిర్ణయం తీసుకున్నారు. అంబేద్కర్ పేరు పెడితే తప్పేంటి. ఏం సాధించాలని అమలాపురంలో చిచ్చు పెట్టారు. ఇది మంచి సంప్రదాయంకాదు. శాంతిభద్రతల పరిరక్షణపై ఉపేక్షించేది లేదు. ఈ ఘటనలో ప్రమేయమున్నవారిని కఠినంగా శిక్షిస్తాం’ అని మంత్రి బొత్స అన్నారు.
కొన్ని శక్తులు నిరసనకారుల్ని రెచ్చగొట్టి అమలాపురంలో విధ్వంసం సృష్టించాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బుధవారం మంత్రి విశ్వరూప్ ఇంటిని పరిశీలించిన సజ్జల.. మీడియాతో మాట్లాడారు.‘ప్లాన్ ప్రకారమే అమలాపురంలో విధ్వంసం సృష్టించారు. అంబేద్కర్ పేరు పెట్టాలని అన్ని వర్గాలు కోరాయి. ప్రధాన పార్టీలన్నీ మద్దతు పలికాయి. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.కులాల మధ్య చిచ్చుపెట్టాలని విపక్షాలు కుట్ర పన్నాయి. కొన్ని శక్తులు నిరసనకారులను రెచ్చగొట్టాయి. ఈ తరహా శక్తుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి ప్రభుత్వానికి తెలుసు.రాష్ట్ర ప్రభుత్వం సంయమనం పాటించడంతోనే ఈ కుట్రను అదుపులోకి తెచ్చాం’ అని ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే నిరసనకారులు తగలబెట్టిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, తన ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరమన్నారు. కోనసీమ సాధన సమితి కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. సంఘ విద్రోహ శక్తులే దారి మళ్లించి విధ్వంసం సృష్టించారన్నారు. కార్యకర్తలను కంట్రోల్ చేయడంలో టీడీపీ, జనసేన విఫలమయ్యింది. నిరసనకారుల ఆందోళనల్లో రౌడీషీటర్లు వచ్చారు. రౌడీషీటర్లే విధ్వంసం సృష్టించారని మంత్రి విశ్వరూప్ అన్నారు.
కాగా, జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పక్కా స్కెచ్‌తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్ చేసుకుంటూ పెట్రేగిపోయాయి. అమలాపురం ఎర్ర వంతెన సమీపంలో మంత్రి పినిపే విశ్వరూప్ అద్దెకు ఉంటున్న ఇంటిపై దాడికి దిగి నిప్పు పెట్టారు. అల్లరి మూకలు తమ చేతిలోని పెట్రోల్ డబ్బాలను ఇంట్లోకి విసరటంతో ఇంటిలో ఉన్న వంట గ్యాస్ సిలిండర్ పేలిపోయి మంటలు బీభత్సంగా వ్యాపించాయి. ఇంటిలో ఉన్న మంత్రి గన్‌మెన్ శ్రీనివాస్, వంట మనిషి ప్రకాష్‌కు గాయాలయ్యాయి.
ఈ సమయంలో మంత్రి విశ్వరూప్‌తో పాటు కుటుంబ సభ్యులెవరూ ఇంటిలో లేకపోవటంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లి అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇంటికి నిప్పు పెట్టారు. ఎమ్మెల్యేపై దాడి జరగకుండా ఆ సమయంలో అక్కడున్న ఆయన అనయాయులు అడ్డుకోగలిగారు. ఇంటిలో ఉన్న ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)