Amalapuram, May 25: కోనసీమ జిల్లాకు జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయిన (Konaseema Violence) సంగతి విదితమే. జిల్లాకు చెందిన దళిత మంత్రి పినిపె విశ్వరూప్, బీసీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను తగులబెట్టారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అమలాపురంతో సహా కోనసీమలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం తక్షణం చర్యలు చేపట్టింది. అత్యంత సమర్థంగా, సంయమనంతో వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది.
అదనపు బలగాలను (additional forces rushed to Amalapuram) పోలీసులు మోహరించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి ప్రత్యేక దళాలను అధికారులు తరలించారు. అమలాపురంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమ బస్సు సర్వీసులను రద్దు చేశారు. అమలాపురంలో పరిస్థితి అదుపులోకి తెచ్చామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. డీఐజీ, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ఆందోళనలపై విచారణ చేపడతామని డీజీపీ పేర్కొన్నారు.
అమలాపురంలో ఆందోళనల్లో పాల్గొని విధ్వంసం ( Amalapuram to contain violence) సృష్టించిన వారిని గుర్తిస్తున్నామని, ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకూడదని అమలాపురంలో కర్ఫ్యూ విధించడం లేదన్నారు. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయాయి. పక్కా స్కెచ్‌తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్ చేసుకుంటూ పెట్రేగిపోయాయి. ఇది కొన్ని కులాలు, వర్గాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావటంతో పోలీసులు పూర్తిస్థాయిలో సంయమనం పాటించగా... దాన్ని అలుసుగా తీసుకున్న ఆ వర్గాలు విచ్చలవిడిగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల్ని ధ్వంసం చేశాయి.
అల్లరిమూకలు ఎస్పీ సుబ్బారెడ్డితోపాటు 20 మందిపై రాళ్లతో దాడిచేసినప్పటికీ పోలీసులు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా వ్యవహరించారు. ఆందోళనకారులను హెచ్చరించేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, రాజమహేంద్రవరం ఎస్పీ ఐశ్వర్యరస్తోగీ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌లను వెంటనే అమలాపురం వెళ్లాలని ఆదేశించారు. విశాఖపట్నం, కృష్ణాజిల్లాల నుంచి కూడా అదనపు పోలీసు బలగాలను అమలాపురానికి తరలిస్తున్నారు.
అమలాపురంతోపాటు కోనసీమ అంతటా పరిస్థితిని పోలీసులు మంగళవారం రాత్రి 8.30 గంటలకల్లా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ముందుగానే దాదాపు నాలుగువేల మందిని వేర్వేరు ప్రాంతాల్లో ఉంచి ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి అల్లర్లు, దాడులకు పాల్పడేలా కొన్ని శక్తులు కుట్రపన్నాయని పోలీసులు గుర్తించారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు తదితరాలను పరిశీలిస్తున్నారు. అమలాపురంలో అల్లర్ల సమయంలో తీసిన వీడియో ఫుటేజీ, ఫొటోల ఆధారంగా కుట్రదారులు, అల్లర్లకు పాల్పడ్డవారిని గుర్తించనున్నారు.
అమలాపురంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం. అసాంఘిక శక్తులు రాళ్లు రువ్వినా సంయమనం కోల్పోకుండా పోలీసులు సమర్థంగా వ్యవహరించారు. విధ్వంసానికి పాల్పడినవారు, అందుకు కుట్రపన్నినవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మకుండా పోలీసులకు సహకరించాలని కోరుతున్నామని డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.